విషాదమైన విహారం.. మానేరు డ్యాంలో పడి ఇద్దరు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

విషాదమైన విహారం.. మానేరు డ్యాంలో పడి ఇద్దరు మృతి

October 18, 2020

సరదాగా కుటుంబంతో కలిసి మానేరు డ్యాం వద్దకు విహారానికి వెళ్లారు వాళ్లు. అనుకోని విపత్తు వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తు మానేరు డ్యాంలో గల్లంతై ఇద్దరు మృతిచెందారు. ఈ విషాద ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. కరీంనగర్‌లోని కశ్మీర్‌గడ్డకు చెందిన 35 ఏళ్ల సఖీనా తన చెల్లెలి కొడుకు రెండున్నరేళ్ల అహాల్‌తో కలిసి అల్గునూర్‌లోని మానేరు ఒడ్డున ఉన్న దర్గా వద్దకు వెళ్లారు. అలాగే ఎల్ఎండీ గేట్ల ద్వారా వదిలిన నీటి ప్రవాహాన్ని చూసేందుకు పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లింది. 

బాబు అక్కడ ఆడుకుంటూ వెళ్లి నీటిలో పడినట్లు గమనించిన సఖీన రక్షించేందుకు నీటిలోకి దిగింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆమె ఆ నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సఖీనా కోసం గాలించగా ఆమె మృతదేహం లభ్యం అయింది. అపస్మారక స్థితిలో ఉన్న బాబును ఎల్ఎండీ ఎస్ఐ కృష్ణారెడ్డి స్వయంగా ఆసుపత్రికి తరలించగా అహాల్ మృతిచెందాడు. ఇద్దరి మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.