ట్రాయ్ కొత్త యాప్.. కేబుల్ టీవీ, డీటీహెచ్ వినియోగదారులకు శుభవార్తే.. - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాయ్ కొత్త యాప్.. కేబుల్ టీవీ, డీటీహెచ్ వినియోగదారులకు శుభవార్తే..

June 27, 2020

trail

కేబుల్ టీవీ, డీటీహెచ్ బిల్లులపై టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ శుభవార్త చెప్పింది. ధరల విధానంలో మరింత పారదర్శకత, వినియోగదారులకు భారం తగ్గించేందుకు కొత్తగా ఓ యాప్‌ను తీసుకువచ్చింది. దాని పేరు ‘ట్రాయ్ ఛానెల్ సెలక్టర్ యాప్’. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేబుల్ టీవీ లేదా డీటీహెచ్‌లో చూడాలనుకుంటున్న ఛానెళ్లను మాత్రమే వినియోగదారులు ఎంచుకుంటే ఎంత బిల్లు అవుతుందో ఈ యాప్ ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు. టాటా స్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, డిష్‌టీవీ, ఇన్‌ డిజిటల్, డీ2హెచ్, హాట్ వే డిజిటల్, ఏషియానెట్, సిటీ నెట్‌వర్క్ లాంటి డీటీహెచ్ ఆపరేటర్లు, కేబుల్ టీవీ ఎంఎస్‌ఓలకు సంబంధించిన అన్ని వివరాలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.  ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్‌లో, యాపిల్ ఐఫోన్ యూజర్లకు యాప్ స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంటుందని ట్రాయ్ వెల్లడించింది.

ఈ యాప్‌‌ను ఎలా వినియోగించాలో చెప్పింది. యాప్ ఓపెన్ చేశాక సదరు వినియోగదారుడు తమ కేబుల్ లేదా డీటీహెచ్ ఆపరేటర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వారి సబ్‌స్క్రిప్షన్ ఐడీ, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. వెంటనే రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే.. కేబుల్ టీవీ, డీటీహెచ్ ఛానెల్ ప్యాక్స్‌ను మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఛానెళ్ల జాబితాలో మరిన్ని ఛానెల్స్ యాడ్ చేసుకోవచ్చు. కాగా, గతంలో కొత్త ధరల విధానాన్ని ఆవిష్కరించిన ట్రాయ్ పలు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కొత్త విధానంతో ధరలు తగ్గలేదని, ఇంకా పెరిగాయని టీవీ యూజర్లు ఆరోపించారు. దీంతో ట్రాయ్ యాప్ దిశగా అడుగులు వేసింది.