నిమిషాలు, గంటలు కాదు.. ఏకంగా ఏడాది ఆలస్యంగా వచ్చిన రైలు - MicTv.in - Telugu News
mictv telugu

నిమిషాలు, గంటలు కాదు.. ఏకంగా ఏడాది ఆలస్యంగా వచ్చిన రైలు

May 28, 2022

మన దేశంలో రైల్వేశాఖపై ఎన్నో రోజుల నుంచి ఒక అపవాదు కొనసాగుతూ వస్తోంది. ఎప్పుడు కరెక్ట్ టైంకి రైలు రాదని.. సరిగా శుభ్రత కూడా ఉండదంటూ ఎంతో మంది ప్రయాణికులు అంటుంటారు. కానీ రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని రత్లాం రైల్వే స్టేషన్‌లో ఓ రైలు రావాల్సిన సమయం కంటే 20 నిముషాలు ముందే వచ్చింది. దీంతో ప్రయాణికులంతా ఆనందంతో ఫ్లాట్ ఫామ్ మీద డాన్సులు చేశారు. ఈ సంగతి తెలిసి కేంద్ర రైల్వే మంత్రి తెగ ఆనందపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కానీ అంతకుముందు జరిగిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. అధికారుల నిర్లక్ష్యం కారణంగా.. ఓ గూడ్స్ రైలు ఏడాది ఆలస్యంగా గమ్యస్థానం చేరింది. ఫలితంగా పేదలకు అందాల్సిన ఆహార ధాన్యాలు పాడైపోయాయి. ఝార్ఖండ్ గిరీడీలో జరిగిన ఈ ఘటన రైల్వే శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 2021 మేలో ఛత్తీస్‌గఢ్‌లోని ఓ రైల్వేస్టేషన్‌లో ఒక రైలు బోగిని వెయ్యి బియ్యం బస్తాలతో నింపారు. 762 కిలోమీటర్లు ప్రయాణించి ఝార్ఖండ్‌లోని న్యూ గిరిడీ స్టేషన్‌ను అది చేరుకోవాలి. సాంకేతిక కారణాలతో అది నిర్ణీత సమయానికి ముందుకు కదలలేదు. తర్వాత దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆ బోగితో గూడ్సు రైలు ఎట్టకేలకు ఏడాది ఆలస్యంగా ఈ నెల 17న న్యూ గిరిడీ స్టేషన్‌ను చేరుకుంది. ఏడాది ఆలస్యం కావడంతో.. 200-300 బస్తాల బియ్యం పాడైపోయిందని అధికారులు తెలిపారు.