రైల్లో కిడ్నాపర్.. 260 కి.మీ. నాన్‌స్టాప్‌గా నడిపి పట్టించిన డ్రైవర్  - MicTv.in - Telugu News
mictv telugu

రైల్లో కిడ్నాపర్.. 260 కి.మీ. నాన్‌స్టాప్‌గా నడిపి పట్టించిన డ్రైవర్ 

October 26, 2020

Train run 260 km non-stop to save three-year-old girl

సమయస్ఫూర్తి ఉండాలి గానీ, ఎంతటి విపత్తును అయినా సునాయాసంగా అధిగమించవచ్చు. ఓ రైలు డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల ఓ బాలిక కిడ్నాపర్ బారినుంచి సురక్షితంగా బయటపడింది. బాలికను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ రైలులో ఎక్కాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు చకచకా అందరినీ అలర్ట్ చేశారు. ముఖ్యంగా రైలు నడిపిస్తున్న డ్రైవర్‌ను రైలు ఎక్కడా ఆపవద్దని చెప్పారు. దీంతో ఆ డ్రైవర్ పాప ప్రాణాలు కాపాడటానికి సిద్ధమయ్యాడు. మధ్యలో వస్తున్న ఏ స్టేషన్ దగ్గర రైలును ఆపకుండా నాన్‌స్టాప్‌గా 260 కిలోమీటర్లు తీసుకెళ్లి ఓ స్టేషన్‌లో ఆపాడు. అక్కడికి వచ్చిన పోలీసులు కిడ్నాపర్‌ చెర నుంచి బాలికను రక్షించి అతణ్ని అరెస్ట్ చేశారు. బాలిక ప్రాణాలు కాపాడటంలో చొరవ చూపిన రైలు డ్రైవర్‌కు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మూడేళ్ల వయసున్న ఓ బాలికను అపహరించిన కిడ్నాపర్ ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో భోపాల్ వెళ్లే ఓ రైలు ఎక్కాడు. 

కిడ్నాపర్ ఆ రైలెక్కడం గమనించిన బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. లలిత్‌పూర్ స్టేషన్‌లోని రైల్వే పోలీసులు వెంటనే స్పందించారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా, ఆ కిడ్నాపర్ బాలికను తీసుకుని రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు గుర్తించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులు ఇతర అధికారులను, లోకో పైలట్లను అప్రమత్తం చేశారు. ఆ రైలును మధ్యలో ఆపితే కిడ్నాపర్ తప్పించుకోవచ్చని.. భోపాల్ వరకు ఎక్కడా ఆపకుండా తీసుకెళ్లాలని సూచించారు. దానికి రైలు డ్రైవర్ సరేనన్నారు. దీంతో లలిత్‌పూర్ స్టేషన్ నుంచి బయల్దేరిన ఆ రైలును మధ్యలో ఏ స్టేషన్‌లోనూ ఆపకుండా.. సుమారు 260 కి.మీ. దూరం ప్రయాణించి నేరుగా భోపాల్ స్టేషన్‌లో ఆపారు. అప్పటికే లలిత్‌పూర్ రైల్వే పోలీసులు భోపాల్ పోలీసులను అప్రమత్తం చేశారు. బాలికతో పాటు ఉన్న కిడ్నాపర్ ఫోటోలను వారికి పంపించారు. భోపాల్ స్టేషన్‌లో పోలీసులు సిద్ధంగా ఉండి కిడ్నాపర్‌ను పట్టుకున్నారు. అతని చెరనుంచి బాలికను రక్షించి సురక్షితంగా తల్లిదండ్రలుకు అప్పజెప్పారు. తమ బిడ్డను కాపాడటంలో పోలీసులు, రైల్వే పోలీసులు, రైలు డ్రైవర్, ఇతర అధికారులు చూపిన చొరవ మరిచిపోలేనిది అంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, దేశంలో ఇలా జరగడం ఇదే తొలి ఘటన అని రైల్వే అధికారులు అన్నారు.