రైలు కింద పడినా నిక్షేపంగా బయటపడ్డ బుడ్డోడు - MicTv.in - Telugu News
mictv telugu

రైలు కింద పడినా నిక్షేపంగా బయటపడ్డ బుడ్డోడు

September 24, 2020

papaaa

అదృష్టమంటే ఈ బుడతడిదని చెప్పాలి. రైలు పై నుంచి వెళ్లినా కూడా చిన్న గీత కూడా పడకుండా క్షేమంగా బయటపడ్డాడు. ఈ అరుదైన సంఘటన హరియాణా రాష్ట్రలో జరిగింది. రాష్ట్రంలోని ఫరీదాబాద్ జిల్లా బల్లాగఢ్‌ రైల్వే స్టేషన్‌లో ఓ రెండేళ్ల పిల్లాడు, తన 14 ఏళ్ల అన్నతో పట్టాలపై ఆడుకుంటున్నాడు. అదే సమయంలో ఢిల్లీ-ఆగ్రా రైలు వచ్చింది. రైలును చూసి అన్న పక్కకు పారిపోగా పిల్లాడు పట్టాలపైనే ఉండిపోయాడు. లోకోపైలట్ అతడిని చూసి ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. అప్పటికే రైలు అతడి మీది నుంచి కొంత దూరం వెళ్లి ఆగిపోయింది. లోకోపైలట్ దీవాన్ సింగ్, ఆయన అసిస్టెంట్ అతుల్ ఆనంద్ రైలు దిగి బాలుడిని పట్టాలపై నుంచి బయటికి తీశారు. 

ఈ సందర్భంగా దీవాన్ సింగ్ మాట్లాడుతూ..’పిల్లాడు సజీవంగా బయట పడడాన్ని నిజంగా నమ్మలేకపోయాం. చిన్నగాయం కూడా కాకుండా అతడు బయటపడడం ఆశ్చర్యంగా అనిపించింది.’ అని అన్నాడు. లోకో పైలట్లు కిందికి దిగి అతడి అన్నను పట్టుకున్నారు. ఈ లోగా ఆ పిల్లల తల్లి అక్కిడికి చేరుకుంది. ఈ సంఘటన గురించి ఆగ్రా డివిజన్ రైల్వేస్ కమర్షియల్ మేనేజర్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..’పిల్లాడు ఇంజిన్ మధ్యలో ఇరుక్కోవడంతో బయటికి తీసుకురావడం అంత సులభం కాలేదు. ముందు అతడిని కంగారు పడొద్దని చెప్పి, తర్వాత నెమ్మదిగా బయటికి తీసుకొచ్చి తల్లికి అప్పగించాం.’ అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకో పైలట్ల సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.