జైల్లో ఖైదీలకు పౌరోహిత్యంలో శిక్షణ
జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో మార్పు రావడం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోంది. తోటపని, కొవ్వొత్తుల తయారీ, కూరగాయాల పెంపకం, చదవాలనుకునే వారికి ఆ తరహా సౌకర్యాలు కల్పించడం వంటివి చేస్తారు. ఇప్పుడు ఆ జాబితాలో పౌరోహిత్యం కూడా చేరింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జైలులో 30 రోజుల కోర్సుతో పౌరోహిత్యం నేర్పుతున్నారు. ఇప్పటిదాకా 100 మంది ఖైదీలకు శిక్షణ ఇచ్చారు. జైలు సూపరింటెండెంట్ ఉషా రాజే ఈ ప్రోగ్రాంను డిజైన్ చేసి అమలు పరుస్తున్నారు. వేద పండితుల సాయంతో ఆలయాల్లో అర్చకత్వం, హోమాలు, యాగాలు చేయడం వంటి వాటిని ఇప్పటివరకు నేర్పించారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్‌తో పాటు గాయత్రి మంత్ర గ్రంథం ఇస్తున్నారు. ఇది వారిలో పరివర్తన తేవడంతో పాటు విడుదలయిన తర్వాత పురోహితులుగా స్థిరపడి జీవించడానికి ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు.