నకిలీ హిజ్రాలకు చెక్.. పింఛనుకు మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వాలి - MicTv.in - Telugu News
mictv telugu

నకిలీ హిజ్రాలకు చెక్.. పింఛనుకు మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వాలి

March 21, 2018

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు హిజ్రాలందు అసలు హిజ్రాలు కొంతమందే. ప్యాంటు చొక్కా విప్పేసి, చీర చుట్టుకని దందాలకు పాల్పడే వాళ్లు కోకొల్లలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి బాపతుగాళ్లకు చెక్ పడింది. రాష్ట్ర సర్కారు.. హిజ్రాలకు ఇస్తున్న రూ. 1500 పింఛన్ మంజూరు కోసం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. హిజ్రాలు తాము అలాంటి వారమని మెడికల్ సర్టిఫికెట్ సమర్పిస్తేనే డబ్బు మంజూరవుతుంది.

మార్గదర్శకాల ప్రకారం.. 18 ఏళ్లు నిండి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న హిజ్రాలకు నెలకు రూ. 1500 చొప్పున ఇస్తారు. వీరికి ఆధార్ కార్డు ఉండాలి. హిజ్రాలను ముగ్గురు ప్రభుత్వ వైద్యలు పరీక్ష చేస్తారు. క్రోనాలజిస్టు, యూరాలజిస్ట్‌, సైకియాట్రిస్ట్‌ వీరిని పరీక్ష చేసి అర్హత ఉన్నట్లు ధ్రువీకరిస్తారు. తర్వాత జిల్లా ప్రభుత్వాస్పత్రి  సూపరింటెండెంట్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు.

తర్వాత హిజ్రాలు మండలాల్లో ఎంపీడీఓలు, మున్సిపాల్టీల్లో కమిషనర్లను కలిసి ఈ సర్టిఫికెట్‌తో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు వాటిని పరిశీలించి, పింఛను మంజూరుచేస్తారు. వివక్షకు గురవుతున్న హిజ్రాలు హుందాగా జీవించడానికి పింఛను ఇస్తామని సీఎం చంద్రబాబునాయుడు రెండు నెలల క్రితం ప్రకటించారు. ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది.