హైదరాబాద్‌కు చెందిన రెండు ట్రాన్స్జెండర్ల గ్రూపులు బంజారాహిల్స్ పీఎస్ వేదికగా పొట్టుపొట్టుగా కొట్టుకున్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసేందుకు పీఎస్‌కు వచ్చిన ఈ రెండు గ్రూపులు.. మాటామాటా పెరిగే అక్కడే పరస్పరం దాడులు చేసుకున్నారు. మరికొందరు పోలీస్ స్టేషన్ ఎదుటే బైఠాయించి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో కలకలం చెలరేగింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నీటిని చల్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. దీనంతంటికి కారణం రెండు గ్రూపుల మధ్య ఆధిపత్యపోరు అని తెలిసింది.
ఇందిరానగర్, కృష్ణానగర్‌లో 12 మందితో ఓ ట్రాన్స్జెండర్ల బృందం ఉంది. ఈ మధ్య ఇందిరానగర్‌కు మోనాలిసా అనే ట్రాన్స్‌జెండర్ వచ్చింది. మొదటి గ్రూపునకు మోనాలిసాకు మధ్య వివాదం ఉంది. దీంతో మొదటి బృందం సభ్యులు ఆదివారం బంజారాహిల్స్ పోలీసులకు మోనాలిసాపై ఫిర్యాదు చేశారు. మహిళ అయిన మోనాలిసా ఇద్దరు పిల్లలకు తల్లి అని, ఇటీవల ట్రాన్స్‌జెండర్‌గా శస్త్ర చికిత్స చేయించుకొని తమ బస్తీకి వచ్చి ఆదిపత్యం చెలాయించడంతో పాటు రౌడీలతో దాడులు చేయిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మోనాలిసాను అరెస్ట్ చేయాలంటూ హిజ్రాలు డిమాండ్ చేశారు.
ఇంతలో మోనాలిసా కూడా పోలీసుస్టేషన్‌కు చేరుకొని బస్తీలో తనను ఉండకుండా చేసేందుకు మొదటి బృందం ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. దీంతో మొదటి బృందానికి చెందిన సభ్యులు ఠాణా ఎదుట బైఠాయించారు. మోనాలిసాను అరెస్టు చేయాలంటూ తమ వెంట తెచ్చిన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. అప్రమత్తమైన పోలీసులు నీటిని చల్లి రెండు గ్రూపులను చెదరగొట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ హెచ్చరించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సముదాయించి పంపించారు. ఇదిలా ఉండగా స్టేషన్లో సోనమ్ రాథోడ్ చేసిన హంగామాపై ఎస్ఐ అంభికా ఫిర్యాదు చేశారు. దీంతో సోనమ్‌తో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు.