Home > Featured > ఎంత కష్టం.. మండే ఎండల్లో సైకిల్ మీద 1300 కి.మీ ప్రయాణం

ఎంత కష్టం.. మండే ఎండల్లో సైకిల్ మీద 1300 కి.మీ ప్రయాణం

Bicycle

లాక్‌డౌన్ వల్ల వలస కార్మికుల కష్టాలు చెప్పతరం కానివి. పాపం పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లి వారు పడుతున్న కష్టాలు మరింత పెరిగాయి. పోయిన చోట పనులు లేక ఖాళీగా ఉండలేక సొంతూళ్ల బాట పడుతున్నారు. మండుటెండలో కాలినడకన బయలుదేరి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు చూస్తున్నాం. వందల కిలోమీటర్లు సైకిళ్ల మీద ప్రయాణం చేస్తున్నారు. చిన్న పిల్లలను వెంట పెట్టుకుని వారు బయలుదేరడం చూస్తుంటే కన్నీళ్లు ఆగడంలేదు. గర్భవతులు కూడా కాలినడకన స్వగ్రామాలకు బయలుదేరి మార్గమధ్యలో కాన్పు అయిన ఘటనలు గుండెలను దేవుతున్నాయి. తాజాగా మరో ఘటనలో ఇద్దరు యువకులు ఏకంగా 1300 కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణం చేశారు. మండుటెండలో వారు ఎలా పెడల్స్ తొక్కారో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది.

వారంతా ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని సొంతూరు మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ నుంచి బెంగళూరు నగరానికి వలస వెళ్లారు. బెంగళూరులో వారు పని చేస్తున్న పైపుల కంపెనీ కరోనా లాక్‌డౌన్‌తో మూతపడింది. దీంతో వారికి పనిలేకుండా పోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో వారు అక్కడ ఉండలేకపోయారు. ఇంటి వద్ద తల్లిదండ్రులు, భార్యాపిల్లలు వీరి కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో వారు సొంతూరుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఎలాంటి రవాణా సదుపాయం లేకపోవడంతో సైకిళ్లే దిక్కు అనుకున్నారు.

ఎండైైనా, వానైనా వెళ్లాల్సిందేనని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1300 కిలో మీటర్ల ప్రయాణం మొదలు పెట్టారు. కూలి పనులతో కూడబెట్టుకున్న డబ్బులతో తలో సైకిల్‌ను కొనుగోలు చేశారు. దారిలో సైకిళ్లకు ప్రాబ్లమ్ వస్తే రిపేర్ కోసం అవసరమైన సామాగ్రి కూడా కొనుక్కున్నారు. ప్రభుత్వం రైళ్లలో పంపిస్తోందన్న నమ్మకం లేకపోవడంతో సైకిల్ మీద వెళ్లడం తప్ప మరో మార్గం కనిపించలేదని యువకుల్లో ఒకరు తెలిపారు. ఆ సైకిళ్లతో వారం రోజుల క్రితం బెంగళూరు నుంచి ప్రయాణం మొదలుపెట్టారు. రోజుకు వంద కిలో మీటర్లకు పైగా సైకిల్‌పై ప్రయాణం చేస్తూ మంచిర్యాలకు చేరుకున్నారు. ఇప్పటికే 800ల కిలో మీటర్లు ప్రయాణించారు. మరో 500ల కిలో మీటర్ల ప్రయాణం చేస్తే వారి స్వగ్రామానికి చేరుకుంటారు. దారి మధ్యలో వారికి దాతలు ఆహారం అందించారు. అదే తింటూ వారు అలుపెరగకుండా సైకిల్ తొక్కుతున్నారు.

Updated : 14 May 2020 11:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top