Treasure trove of antique gold coins found during reconstruction of dilapidated house in MP
mictv telugu

బంగారు నిధిని గుట్టుగా పంచుకున్న కూలీలు.. తప్పతాగి నోరుజారేసరికి

August 30, 2022

కొత్త బిల్డింగ్ కట్టేందుకు శిథిలావస్థలో ఉన్న ఇంటిని కూలుస్తుండగా కూలీలకు బంగారంతో కూడిన లోహపు పాత్ర బయటపడింది. గుట్టుచప్పుడు కాకుండా అందులోని బంగారు నాణేలు, అరుదైన అభరాణాలను పంచేసుకున్నారు. కానీ తాగిన మైకంలో ఓ వ్యక్తి నోరుజారడంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శిథిలావస్థలో ఉన్న ఇంటిని కూల్చివేసేందుకు యజమాని 8 మంది కూలీలను పురమాయించారు. వారు పనులు మొదలుపెట్టి కొంతభాగాన్ని కూల్చివేశారు. ఆ శిథిలాలను తరలిస్తున్న సమయంలో ఓ లోహపు పాత్ర కనిపించింది. దానిని తీసుకుని చూడగా అందులో 84 పురాతన బంగారు నాణేలు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు కనిపించాయి. అయితే ఈ విషయాన్ని వారు బయటకు పొక్కనీయలేదు. యజమానికి తెలియకుండా ఆ ఎనిమిది మంది పంచుకున్నారు.

కాగా వారిలో ఓ కూలీ తాజాగా నాణేన్ని అమ్మేశాడు. వచ్చిన రూ.56వేలతో కొన్ని సరకులు, ఓ ఫోన్‌ కొనుక్కున్నాడు. ఆపై ఫూటుగా తాగి, ఆ మైకంలో తమకు దొరికిన బంగారు నిధి గురించి మిత్రులకు చెప్పాడు. ఈ విషయం కాస్తా పోలీసుల దృష్టికి చేరింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ కూలీలందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు నాణేలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.60 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొంటుండగా.. పురావస్తు శాఖకు చెందిన అధికారులు మాత్రం రూ.1.25కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.