కరోనా సోకినవారు చాలామంది ఆసుపత్రులకు వెళ్లకుండా వైద్యుల సలహాలను ఫోన్లలో తీసుకుంటూ ఇళ్లల్లోనే హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. కొందరు నిజాయితీ గల వైద్యులు ఇదే మాట చెబుతున్నారు. ఇంట్లోనే ఉండి ధైర్యంగా చికిత్స తీసుకుంటే కరోనా తగ్గిపోతుందని. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటేనే ఆసుపత్రికి రావాలని చెబుతున్నారు. కరోనా సాకుతో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ ఏ రేంజులో ఉందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. తాజాగా అలాంటి ఓ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, బాచుపల్లిలోని ఎస్ఎల్జి ఆసుపత్రిలో చోటు చేసుకుంది. సదరు ఆసుపత్రిలో ఒక కరోనా రోగి వైద్యుల పొరపాటు కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తన తండ్రి మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అని మృతుడి కుమార్తె శ్వేత ఆరోపిస్తున్నారు.
పాజిటివ్ ఉన్న డాక్టర్తో చికిత్స చేశారు అని మీడియా ముందు మండిపడ్డారు. నడుచుకుంటూ వెళ్లిన తన తండ్రిని ఇంజెక్షన్లతో పడుకోపెట్టి ఇప్పుడు రెండుసార్లు గుండెపోటుతో మరణించినట్లు చెప్తున్నారు అని ఆమె కన్నీరుమున్నీరు అయ్యారు. 55 వేల ఇంజక్షన్లతో పాటు రోజుకి 10 పీపీఈ కిట్లు అంటూ చెప్పారని తెలిపారు. కానీ వెంటిలేటర్ పేషెంట్ వద్దకు వెళ్లిన సిబ్బంది అవి ఏమీ ధరించలేదు అని ఆవేదన వ్యక్తంచేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి మరణించాడని ఆమె అన్నారు. సుమారు రూ.5 లక్షల వరకు బిల్లు వేశారని నిప్పులు చెరిగారు.