యుద్ధ నేరాలపై విచారణ.. రష్యా సైనికుడికి యావజ్జీవ శిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధ నేరాలపై విచారణ.. రష్యా సైనికుడికి యావజ్జీవ శిక్ష

May 23, 2022

బందీలుగా పట్టుబడ్డ రష్యన్ సైనికులపై ఉక్రెయిన్ యుద్ధనేరాల కింద విచారణను ప్రారంభించింది. ఓ పౌరుడిని కాల్చి చంపిన అభియోగం మీద వదీమ్ షిషిమారిన్ అనే 21 ఏళ్ల సార్జెంట్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో యుద్ధ నేరం కింద తొలిసారి శిక్ష పడినట్టైంది. ఫిబ్రవరి 24 నుంచి రష్యా యుద్ధం ప్రారంభించగా, 28వ తేదీన సుమీ ప్రాంతంలోని ఓ గ్రామవాసి తలపై తుపాకీతో వదీమ్ కాల్చి చంపాడు. కోర్టులో విచారణ సందర్భంగా వదీమ్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు.

అయితే ఉన్నతాధికారి ఆదేశాల మేరకు, తమ ఉనికిని ఆ వ్యక్తి ఉక్రెయిన్ దళాలకు చేరవేస్తాడేమోనన్న భయంతోనే కాల్చి చంపానని తెలిపాడు. దీంతో న్యాయమూర్తి నేరాన్ని నిర్ధారించి శిక్ష ప్రకటించారు. ఇది తొలి శిక్ష కాగా, ఇంకా పెండింగ్‌లో వేల కేసులు ఉన్నాయి. అయితే ఇరు వైపులా సైనికులు యుద్ధ ఖైదీలుగా, బందీలుగా ఉన్నారు. మరియపోల్ నగరంలోని ఉక్కు కర్మాగారంలో వారం పాటు దాక్కున్న అత్యంత కిరాతక ఉక్రెయిన్ రెజిమెంట్‌ని రష్యా బందీలుగా పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఖైదీల మార్పిడి ఉంటుందని అంతా భావించారు. కానీ, ఉక్రెయిన్ రష్యా సైనికుడికి జీవిత ఖైదు విధించడంతో రష్యా ఎలా స్పందిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.