ఆన్ లైన్ ప్రేమ‌..  లాట‌రీ ద్వారా వ‌ధువు ఎంపిక‌ - MicTv.in - Telugu News
mictv telugu

ఆన్ లైన్ ప్రేమ‌..  లాట‌రీ ద్వారా వ‌ధువు ఎంపిక‌

September 6, 2021

Triangle love -Bride Selection by lottery

ముక్కోణపు ప్రేమ క‌థ‌ను లాటరీ ద్వారా పరిష్కరించారు గ్రామపెద్దలు. ఇద్దరు యువతులతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రేమాయ‌ణం సాగించాడు ఓ యువ‌కుడు. విషయం గ్రామ పెద్ద‌ల దృష్టికి వెళ్ల‌డంతో .. యువకుడికి లాటరీ ద్వారా ఓ యువతిని ఇచ్చి కట్టబెట్టారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. 

హసన్ జిల్లా సకలేశపుర సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఇంటర్నెట్ సాయంతో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు యువతులను ప్రేమించాడు. ఈ నేప‌థ్యంలో అత‌డిని పెళ్లి చేసుకోవాలని భావించిన యువ‌త‌లిద్ద‌రూ గ్రామానికి వచ్చారు. స‌ద‌రు యువ‌కుడు ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రిని ప్రేమిస్తున్నాడ‌నే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ఎవరిని పెళ్లి చేసుకోవాలన్న సమస్య గ్రామ పెద్దల ముందుకు చేరింది.

మరోవైపు, అతడు లేకుంటే బతకలేనంటూ ఆ ఇద్దరు యువతుల్లో ఒకరు  విషం తాగ‌డంతో… గ్రామస్థులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ప్రాణాపాయం నుండి బ‌య‌ట‌ప‌డిన యువ‌తి మరోసారి గ్రామానికి రావ‌డంతో సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో గ్రామ పెద్ద‌లు ముక్కోణ‌పు ప్రేమ క‌థ‌ను పరిష్కరించడానికి  ఓ మార్గాన్ని క‌నిపెట్టారు. ఇద్ద‌రి యువ‌తుల పేర్లను లాటరీ తీసి ఎవరి పేరు వస్తే వారే అతడిని పెళ్లి చేసుకోవాలని, పేరు రాని యువతి ఎటువంటి అభ్యంత‌రం చెప్ప‌కుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలని షరతు విధించారు. 

ఇద్ద‌రి అంగీకారంతో లాట‌రీ తీయ‌గా.. ఆత్మహత్యకు యత్నించిన యువతి పేరు వచ్చింది. దీంతో గ్రామపెద్దలు మరో యువతి సమక్షంలోనే వారిద్దరికి పెళ్లి చేశారు. మరో ప్రేమికురాలు వారికి అభినంద‌న‌లు తెలుపుతూనే.. త‌న‌ను మోసం చేసిన ప్రియుడిని వ‌దిలి పెట్టబోన‌ని హెచ్చ‌రిస్తూ అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ఇక ఈ విష‌యాన్ని ఆ గ్రామ పెద్దలు తెల‌ప‌డంతో వెలుగులోకి వ‌చ్చింది.