తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ.. బిల్లు ఆమోదం! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ.. బిల్లు ఆమోదం!

July 18, 2022

తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కూడా సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించనుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 24 బిల్లుల్లో ఈ వర్సిటీ బిల్లు కూడా ఉందని కాసేపటిక్రితమే ఓ బులెటిన్ విడుదల చేసింది.

‘కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, 2022ను కేంద్ర విద్యాశాఖ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లను లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించనుంది. ఆ తర్వాత తెలంగాణలో యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతి వస్తుంది” అని బులెటిన్‌లో పేర్కొంది.

మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల క్రితమే గిరిజన వర్సిటీ ఏర్పాటు అయ్యింది. కానీ, తెలంగాణలో ఏర్పాటు కాలేదు. దానికి ప్రధాన కారణం.. తెలంగాణ ప్రభుత్వం భూకేటాయింపులో జాప్యం చేయడం వల్ల వర్సిటీ ఏర్పాటు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. తాజాగా ములుగు జిల్లా జాకారంలో గిరిజన వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించగా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఖరారు చేసింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో గిరిజన విశ్వవిద్యాలయం బిల్లు ఖచ్చితంగా ఆమోదం పొందుతుందని, ఆ తర్వాత వెంటనే తెలంగాణలోని ములుగు జిల్లాలో కేటాయించిన స్థలంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అవుతుందని  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ తెలిపింది.