భారత సర్కారుకు భారీ సవాల్.. ఆదివాసీ స్వతంత్ర రాజ్యాల స్థాపన - MicTv.in - Telugu News
mictv telugu

భారత సర్కారుకు భారీ సవాల్.. ఆదివాసీ స్వతంత్ర రాజ్యాల స్థాపన

March 26, 2018

‘మేం భారత దేశంలో లేం. మా సొంతగడ్డలపై ఉన్నాం.. హిందుస్తాన్ వద్దు, పాకిస్తాన్ వద్దు.. మాకు ఆదివాసిస్తాన్ కావాలి. లోక్‌సభ కాదు, రాజ్యసభ కాదు, గ్రామ సభే ఉన్నతం.. ఎన్నికలను బహిష్కరిస్తున్నాం.. మాకు ఆధార్ కార్డులు వద్దు, ఓటరు కార్డులు వద్దు.. పేలపిండి వద్దు,  అసలు ఈ దోపిడీ సర్కారు నుంచి ఏమీ వద్దు.. మా పిల్లలను సర్కారీ స్కూళ్లకు పంపం. మేం కష్టజీవులు. మా ప్రాంతంపై మాకే పట్టుండాలి. పోలీసులను రానివ్వం, రాజకీయ నాయకులను రానివ్వం. గిరిజనేతరులు కూడా రాకూడదు. వస్తేగిస్తే మాకు పన్ను కట్టాల్సిందే.. ’

ఎవరో నక్సలైట్ నాయకుడి ప్రసంగంలోని ముక్కలా ఉంది కదా. దేశద్రోహం కేసు పెట్టించుకోవడానికి ఉండాల్సిన ఘాటంతా ఉంది. కానీ ఈ మాటలంటున్నది నక్సల్స్ కాదు. నికార్సైన ఆదివాసులు. ఎక్కడా అంటే, చాలా చోట్ల! జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిFe మరెన్నో చోట్ల. పత్తర్‌ఘట్టీ(పునాది రాయి) ఉద్యమం పేరుతో ఎక్కడికక్కడ స్థానిక స్వయంపాలన రాజ్యాలను స్థాపించుకుంటున్నారు గిరిపుత్రులు.

నక్సల్స్ అండలేదు..

వారికి నక్సల్ తుపాకుల అండ లేదు, ఎర్రజెండా చేయూత లేదు. ఉన్నది గొడ్డలి, కత్తి, కర్ర, విల్లు, బాణాలు! అంతే. తరతరాల దోపిడీని వదిలించుకోవడడానికి ఎక్కడికక్కడ ఏకమవుతున్నారు. ‘కాగితం చిరిగిపోతుంది. కంప్యూటర్లు కాలిపోతాయి. కానీ ఈ పునాదిరాయి శాశ్వతం’ అని నినదిస్తున్నారు.

మార్చి 4న జార్ఖండ్ రాజధాని రాంచీకి వంద కి.మీ. దూరంలోని దట్టమైన అడవిలో సోన్పూర్ వద్ద 30 గ్రామాలు ఏర్పాటు చేసుకున్న పత్తర్ ఘట్టీ ఒక తాజా ఉదాహరణ.  వేలాదిమంది పెద్దాపిల్లా.. ఒకే చోట చేరి స్వయంపాలనకు పత్తర్ ఘట్టీ వేశారు. ఇలా స్వతంత్రం ప్రకటించుకున్న గ్రామాల్లో సోన్ పూర్ 60వది. కుంతియా, సిమ్ దెగా, గుల్మా, తూర్పు, పశ్చిమ సింగ్ భమ్ తదితర జిల్లాలో ఆదివాసీ రాజ్యాలు ఏర్పడ్డాయి. ‘మేం ప్రత్యేక ఆదివాసీ కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం.. ఎవరు అడ్డొచ్చినా ముందుకెళ్తాం..’ అని ఒడిశాలో ఈ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే జార్జి టీర్కీ హెచ్చారు. ఈ ఉద్యమకారులకు, పోలీసులకు నడుమ తరచూ ఘర్షణలు కూడా జరుగుతున్నాయి.

ఆరోపణలు..

న్యూస్18 మీడియా సంస్థ ఈ రాజ్యాలపై అధ్యయనం చేసి పలు కథనాలు అందిస్తోంది. అయితే ఈ రాజ్యాల వెనుక నక్సల్స్ హస్తముందని పోలీసులు ఆరోపిస్తున్నారు. కానీ నక్సల్స్ ఉద్యమం పట్టుకోల్పోతోందని, ఆదివాసులు తమ బతులకులను తామే బాగు చేసుకోవడానికి పోరుబాట పట్టారని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. పరిశ్రమలు, అభివృద్ధి పేర్లతో అడవులను పెట్టుబడిదారులు దోపిడీ చేస్తుండడంతో ఆదివాసులకు జీవనోపాధి కరవవుతోందని, దీంతో వారు ప్రతిఘటనకు దిగుతున్నారని విశ్లేషిస్తున్నారు. ఈ స్వతంత్ర రాజ్యాల స్థాపన వెనుక ఈ సారూప్యం కనిపిస్తోందని చెబుతున్నారు.  మరికొందరు దీని మూలాలు గుజరాత్‌లోని సతీపతి ఆశ్రమంలో ఉన్నాయని, అక్కడి బోధనలు విన్న నేతలు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. ఆశ్రమ వ్యవస్థాపకుడు కన్వర్ కేసరీ సింగ్ ఇలాంటి డిమాండ్లు వినిపిస్తున్నారు. ప్రజలు పన్నులు కట్టొద్దని, ప్రభుత్వ పత్రాలు తీసుకోవద్దని కోరుతున్నాడు.

లీజు అయిపోయింది..

మా ప్రాంతాలను బ్రిటిషర్లు యూనియన్ ఆఫ్ ఇండియాకు 1870లో 99 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. 1969లో ఆ గడువు తీరిపోయింది అని గిరిజన నేతలు చెబుతున్నారు. దీనికి సరైన కారణమే ఉంది. ఆదివాసుల జీవితంపై ప్రభావం చూపే నిర్ణయాలన్నింటిని 1969 తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం మళ్లీ ఆమోదించాల్సి ఉంటుందని అప్పట్లో చెప్పుకున్నారు.

ప్రకటనే కాదు.. ఆచరణ కూడా..

పత్తర్ ఘట్టీ రాజ్యాల స్థాపన కేవలం ప్రకటనలకే పరిమితం కావడం లేదు. గిరిజనులు ఏకతాటిపైకొచ్చి తమ బతుకులను తామే బాగుచేసుకుంటున్నారు. తార్పర గ్రామం దీనికి ఉదాహరణ. కొండపైన ఉన్న ఈ గ్రామంలోకి ఇంతరకు సరైన దారి లేదు. ఇటీవల అందరూ తలా ఓ చెయ్యేసి కొండలను కరిగించి బాట వేశారు. అంతేకాకుండా ఆ దారిలో ఏకంగా ఒక ట్రాక్టర్నే పైకి తీసుకెళ్లారు. ఈ రాజ్యాలను మొగ్గదశలో చిదిమేయాలని సర్కార్లు యత్నిస్తున్నాయి. అధికారులను గ్రామాలకు పంపి, ‘పత్తర్ ఘట్టీలు రాజ్యంగ వ్యతిరేకం. మీరు జైల్లో పడతారు..’ అని హెచ్చరిస్తున్నారు.

ఏదేమైనా పత్తర్ ఘట్టీ రాజ్యాలు ఆదివాసులు తాజా నిరసన స్వరాలను, అభివృద్ధి ఫలాలు అందరికీ కాకుండా పిడికెడు మందికి మాత్రమే అందిస్తే ఏమవుతుందో చేసే హెచ్చరికలు!