గబ్బు ముండ.. అని తిడుతున్నారు... - MicTv.in - Telugu News
mictv telugu

గబ్బు ముండ.. అని తిడుతున్నారు…

August 25, 2017

ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పినా బాధితుల కష్టాలు తొలగిపోలేదు. ట్రిపుల్ తలాక్ ను కోర్టులో సవాల్ చేసిన బెంగాల్ మహిళ ఇష్రత్ జహాన్ ను ఆమె అత్తింటివారు వేధిస్తున్నారు. ఇరుగుపొరుగు వారు సంఘబహిష్కారం విధించారు. అంతేకాకుండా అపవాదులు వేస్తూ దుష్ప్రచారం మొదలుపెట్టారు.

సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించినప్పటి నుంచి ఇష్రత్ నివసిస్తున్న హౌరాలోని ఫిల్ఖానాలో ఆమె శీలాన్ని శంకిస్తూ బురదజల్లుడు ప్రచారం ప్రారంభించారు.

‘గబ్బు ముండ, సైతాన్… అని నన్ను మాటల్లోని చెప్పలేనంత ఘోరంగా తిడుతున్నారు.. నన్ను చూసి మూతులు ముడుచుకుంటున్నారు.. నేను రోడ్డుపై వెళ్తుంటటే ఉమ్మేస్తున్నారు.. ఏదో దెయ్యాన్ని చూసినట్లు తలుపులు మూసేసుకుంటున్నారు.. మా అత్తింటివాళ్లే కాకుండా ఇరుగుపొరుగువారూ తిడుతున్నారు.. నేను చేసిన నేరమేంటి? దుర్మార్గమైన ట్రిపుల్ తలాక్ పై పోరాడ్డమేనా? సాటి మహిళలకు అండగా నిలబడ్డమేనా?.. ’’ అని ఇష్రత్ ఆక్రోశంతో ప్రశ్నిస్తోంది.

దుబాయ్ లో ఉన్నఇష్రత్ భర్త  అక్కడి నుంచే ఫోన్ లో తలాక్ చెప్పేసి విడాకులిచ్చాడు. కారణం లేకుండా విడాకులేంటని ఇష్రత్ కోర్టునా శ్రయించింది. చిత్రమేమంటే.. ఇష్రత్ ను వేధిస్తున్న అత్తింటి వాళ్లు ఇష్రత్ తెచ్చిన కట్నంతో కొన్న ఇంట్లోనే నివసిస్తుండటం. విడాకుల తర్వాత కూడా వాళ్లు సిగ్గులేకుండా ఆ ఇంట్లో ఉంటూ, మళ్లీ ఆమెపైనే నిందలు మోపుతుండటం..