బీజేపీలో చేరిన ట్రిపుల్ తలాక్ యోధురాలికి కీలక పదవి - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీలో చేరిన ట్రిపుల్ తలాక్ యోధురాలికి కీలక పదవి

October 21, 2020

triple talaq petitioner Shayara Bano appointed to Uttarakhand women panel

ట్రిపుల్ తలాక్ రద్దు కోసం పోరాడిన షాయరా బానో ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బీజేపీ పార్టీలో చేరిన 10 రోజుల్లోనే ఆమెను ఈ పదవి వరించడం గమనార్హం. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ..’మహిళల సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఈ నియామకాలు ఉపయోగపడుతాయి. పెండింగ్ వివాదాలన్నీ వేగంగా పరిష్కారం అవుతాయి.’ అని తెలిపారు.

ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన వారిలో షాయరా బానో ఒకరు. ఉద్ధంసింగ్ నగర్ జిల్లాకు చెందిన షాయరా బానోకు 2014లో ఆమె భర్త స్పీడ్ పోస్ట్ ద్వారా విడాకులు ఇచ్చారు. దీంతో ఆమె ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇతర పిటిషన్లతో కలిపి ట్రిపుల్ తలాక్ రద్దుకై సుప్రీంలో పోరాడారు. ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017లో తీర్పు చెప్పింది. ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని నిషేధిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టంను తీసుకొచ్చింది. అప్పటినుంచి ఎవరైనా ముస్లిం భర్తలు తమ భార్యలకు ట్రిపుల్ తలాక్ చెబితే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.