టిక్‌టాక్‌లో మరో ప్రాణాంతక వెర్రి... - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్‌లో మరో ప్రాణాంతక వెర్రి…

February 14, 2020

Tripping Jump.

ఐస్ బకెట్, కికి ఛాలెంజ్, చేర్ ఛాలెంజ్ ఇలా రకరకాల ఛాలెంజ్‌లను టిక్‌టాక్ తెర మీదకు తెస్తున్నారు. అయితే ఇలాంటి ఛాలెంజ్ వల్ల ఉపయోగాల సంగతి అటు ఉంచితే.. ప్రమాదాలను మాత్రం చక్కగా కొని తెచ్చుకుంటున్నారు. లైకులు, కామెంట్ల కన్నా ఆ ప్రమాదాలు పెద్దవేం కావు అని వాదించే పైత్యపు టిక్‌టాక్ యూజర్స్ ఉన్నంతకాలం ఇలాంటి వెర్రి ఛాలెంజ్‌లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మరో డేంజరస్ ఛాలెంజ్ ఒకటి టిక్‌టాక్‌లో మొదలైంది. ఈ ఛాలెంజ్ ఇంకా మన దేశానికి రాలేదు కానీ… విదేశాల్లో పలువురి ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. 

వద్దురా కొడకా అంటే వింటారా? అమ్మో నా లైకులు, నా కామెంట్లు, నా షేర్లు అని పిచ్చివాళ్లలా అరుస్తారు. ఈ ఛాలెంజ్ పేరు ‘ట్రిప్పింగ్ జంప్’. ఈ ఛాలెంజ్‌లో ముగ్గురు వ్యక్తులు ఉంటారు. మధ్యలో వ్యక్తికి అసలు ఏం జరుగుతుందో తెలియదు. కుడివైపు, ఎడమవైపు ఉన్నవారు మధ్యలో ఉన్న వ్యక్తిని జంప్ చేయమని అడుగుతారు. ఏం జరుగుతుందో తెలియని మధ్యలో వ్యక్తి జంప్ చేయగానే, మిగతా ఇద్దరు వ్యక్తులు మధ్యలో వ్యక్తి కాళ్లను భూమి మీద ఆన్చకుండా తంతారు. అంతే… అతను బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడిపోతాడు. తల నేరుగా నేలకు గట్టిగా తాకుతుంది. అంతే… క్షణాల్లో ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఒక్కోసారి వెన్నుముక విరిగే ప్రమాదం కూడా ఉంది. అయినా కొందరు సరదా కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 

ఈ ఆట ఆడి పలువురు ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఛాలెంజ్ చేసినందుకు ఫ్లోరిడా హైస్కూల్‌లో చదివే ఇద్దరు విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియోలు వాట్సప్‌లో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. కాగా, ఈ డేంజరస్ ఛాలెంజ్‌ను వ్యతిరేకిస్తూ change.org వెబ్‌సైట్‌లో కూడా పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే ఈ పిటిషన్‌పై 44,000 మంది సంతకాలు చేశారు. ఇలాంటి క్రీడలు చాలా ప్రమాదం అని పెద్దవాళ్ల తమ పిల్లలకు చెప్పడం ఎందుకైనా మంచిది.