ఎర్రకోట నేలమట్టం.. త్రిపురలో కామ్రేడ్లకు ఘోర ఓటమి - MicTv.in - Telugu News
mictv telugu

ఎర్రకోట నేలమట్టం.. త్రిపురలో కామ్రేడ్లకు ఘోర ఓటమి

March 3, 2018

త్రిపురలో పాతికేళ్లుగా ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న కామ్రేడ్లకు కోలుకోలేని దెబ్బతగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. సీపీఎం నేత, ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ నీతినిజాయితీని జనం పట్టించుకోలేదు. దక్షిణాదిన తప్ప దేశవ్యాప్తంగా వీస్తున్న బీజేపీకే రాష్ట్ర ఓటర్లు పట్టం గట్టారు. మొత్తం 60 సీట్లకు గాను 40కి పైగా సీట్లను కమలనాథుల ఖాతాలో వేశారు. సీపీఎం దాదాపు 15 స్థానాలకే పరిమితమైంది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. అధికార ఏర్పాటుకు 31 సీట్లు సరిపోతాయి. బీజేపీ 43 స్థానల్లో సీపీఎం 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్, ఇతర పార్టీలు పోటీలోనే లేవు. ఒక అభ్యర్థి మరణం వల్ల ఒక స్థానంలో ఎన్నికలను వాయిదా వేశారు.కౌంటింగ్‌లో ఫలితాలు తారుమారు..

త్రిపుర ఎన్నికల కౌంటింగ్ తొలుత కమ్యూనిస్టులకే అనుకూలంగా కనిపిచింది. ఒక దశలో సీపీఎం కూటమి 24 స్థానాల్లో, బీజేపీ 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగాయి.  అయితే తర్వాత రానను రాను సీపీఎం మెజారిటీ తగ్గిపోయింది. బీజేపీ తొలిసారిగా త్రిపురలో అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడం తెలిసిందే.