ఈశాన్య రాష్ట్రాల్ల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. ఉదయం 7గంటల నుంచి త్రిపుర ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. మేఘాలయ, నాగాలండ్ లలో ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల అనంతరం మార్చి 2న మూడు రాష్ట్రాల కౌంటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే తొలిదశలో 16న గురువారం జరిగే త్రిపుర రాష్ట్ర ఎన్నికలకు ఏర్పాటన్నీ పూర్తి చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి గిత్తె కిరణ్ కుమార్ దినకారో తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ 3,337 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు. వీటిలో 1100 సున్నితమైన కేంద్రాలు, 28 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు.
కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ, ఐపీఎఫ్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది. సీపీఎం కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తోంది. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ త్రిపురలో శాంతి భద్రతలను కాపాడిందని ప్రధాని తన ప్రచారంలో చాలాసార్లు ప్రస్తావించారు. వామపక్షాలు 47స్థానాల్లోనూ, 13స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో పరస్పర పోటీ ఒడంబడిక జరిగింది. మరోవైపు త్రిపుర మోర్చా కూడా పోటీలోకి దిగింది. కొన్ని చోట్ల త్రిముఖం, ఇంకొన్ని చోట్ల బహుముఖ పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు స్వచ్చందంగా ఓట్లు వేస్తే బీజేపీ ఓడిపోవడం ఖాయమని లెఫ్ట్ భావిస్తోంది. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతోంది.
ఇప్పటికే త్రిపురలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షాలు ప్రచారం నిర్వహించారు. పోలింగ్ సందర్బంగా పెద్దెత్తున హింస చెలరేగవచ్చన్న ఆందోళన అక్కడ కనిపిస్తోంది. కేవలం 36లక్షల జనాభా ఉన్న ఈశాన్య సరిహద్దు రాష్ట్రంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సంఘం 31,000 మంది పోలింగ్ సిబ్బందిని, 25,000 మంది కేంద్ర బలగాల భద్రతా సిబ్బందిని నియమించింది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఓటింగ్ నిర్వహించేలా చర్యలు చేపట్టింది. అదనంగా రాష్ట్రానికి చెందిన 3100మంది పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మోహరించారు. ముందస్తుగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే నిషేధాజ్ఞలు విధించామని ఫిబ్రవరి 17 ఉదయం 6గంటల వరకు అమలులో ఉంటాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఎన్నికల్లో 28లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి ఓటుతోనే 259మంది అభ్యర్థుల భవిత్యం తేలనుంది.