డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యానని కొంతమంది సినీతారలు ముద్దుముద్దుగా చెబుతుంటారు. అవన్నీ నూటికి తొంభై శాతం అబద్ధాలేనని అందరికీ తెలుసు. కెరీర్, డబ్బు, పేరు ప్రతిష్టల కోసం సినిమాల్లోకి రావడం మామూలే. రాజకీయాల్లోకి కూడా అలాగే వస్తుంటారు. ఇలా వచ్చేవారిలో కొందరు నిజంగానే డాక్టర్లు, ఇంజినీర్లు ఉంటారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా కూడా డాక్టరే. రాజకీయాల్లోకి వచ్చేశాక ఆయన స్టెతస్కోపును పక్కనపడేశారు. తాజాగా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ గ్రీన్ గౌన్ తొడుక్కుని సర్జరీ పరికరాలు పట్టుకున్నారు. ఓ బాలుడికి ఆపరేషన్ను సక్సెస్ఫుల్గా చేశారు. హపానియాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఓ బాలుడికి సీఎం డెంటల్ సర్జరీ చేశారు. ఆయనతోపాటు మరికొందరు వైద్యులు కూడా శస్త్రచికిత్సలో పాల్గొన్నారు. ఆయన గతంలో ఇదే ఆస్పత్రిలో పనిచేశారు. బీజేపీకి చెందిన సాహా ఏడు నెలల కిందటే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సాహా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు.