ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నాగారా మోగింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలతో 2023 ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 16న, మేఘాలయం, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరపుతున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను మార్చి 2న ప్రకటించనుంది. 2018లో త్రిపురలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ప్రస్తుతం మరోసారి ఈ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై సీవిజిల్ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్‌కి తెలియజేయవచ్చునని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోగా స్పందిస్తామని చెప్పారు. ప్రలోభాలు లేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.
ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తం 180(ఒక్కో రాష్ట్రంలో 60 స్థానాలు) అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నాగాలాండ్ అసెంబ్లీ పదవీ కాలం మార్చి 12న, మేఘాలయం పదవీ కాలం మార్చి 15న, త్రిపుర పదవీ కాలం మార్చి 22న ముగుస్తోంది. హైస్కూల్ పరీక్షలు, భద్రతా బలగాల కదలికలను దృష్టిలో ఉంచుకుని ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రూపొందించినట్లు ఈసీ తెలిపింది. ప్రస్తుతం త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఉండగా.. నాగాలాండ్ లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అధికారంలో ఉంది. మేఘాలయంలో నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వం ఉంది.