బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు చేదు అనుభవం ఎదురైంది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో గోదావరి ముంపును పరిశీలించడానికి వెళ్లిన ఆయన కాన్వాయ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. కారులో ఉన్న అరవింద్‌కు చెప్పుల దండ వేసేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎంపీకి కాన్వాయ్‌లోని రెండు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. భారీ భద్రత నడుమ ఎంపీ కాన్వాయ్‌ని అక్కడి నుంచి పంపించివేశారు. ఆ తర్వాత.. ఎంపీ అర్వింద్ గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు..పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన అర్వింద్ పదవికి రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. వరదల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.