టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి  - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి 

January 22, 2020

bn bn

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుండగా ఓ చోట మాత్రం ఉద్రిక్తతకు దారితీసింది. పలుచోట్ల వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో  టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ ముక్కును, వేళ్లను కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాజ్ కొరికాడు. రక్తస్రావం కావడంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ఎన్నికల అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాజ్ రిగ్గింగ్‌కు పాల్పడుతుండడంతో తాను అడ్డుకున్నాడని ఇమ్రాన్ తెలిపాడు. కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడికి పాల్పడి ముక్కు, చేతి వేళ్లను కొరికారని ఇమ్రాన్ ఆరోపించారు. ఇదిలావుండగా పలు పోలింగ్ బూతుల వద్ద పార్టీ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్చిపూర్‌లో ముక్కు పుడకలు పంచుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలోని గంజిపేట పోలింగ్ బూత్ వద్ద మజ్లిస్ నేతలు ఓటర్లను మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇదిలావుండగా ఓటర్లను గుర్తించేందుకు ఎన్నికల సంఘం తొలిసారిగా కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. కొంపల్లిలోని 10వ పోలింగ్ కేంద్రంలో అధికారులు ఫేస్ రికగ్నేషన్ యాప్‌ను వాడుతున్నారు.