మల్లారెడ్డి.. ‘ఐటీ’ దాడుల్లో వేరేవాళ్లు పాల్గొన్నారా? - MicTv.in - Telugu News
mictv telugu

మల్లారెడ్డి.. ‘ఐటీ’ దాడుల్లో వేరేవాళ్లు పాల్గొన్నారా?

November 24, 2022

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంటితోపాటు, పలువురు బంధువుల ఇళ్లపై, కాలేజీలపై ఆదాయ పన్నుశాఖ చేసిన దాడులు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అక్రమ డొనేషన్లు, అక్రమ పెట్టుబళ్ల ఆరోపణపై కనీవినీ ఎరుగని రీతిలో రెండు రోజులకు పైగా సోదాలు జరగడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. దాడుల్లో తెలంగాణతోపాటు ఒడిశా, కర్ణాటకలకు చెందిన ఐటీ అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాదాపు 400 మంది అధికారులు 65 బృందాలుగా ఏర్పడి యుద్ధప్రాతిపాదికన తనిఖీ చేశారు. కొన్ని కోట్లు నగదు, డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. తమను బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారని, ఆడవాళ్లను భయపెట్టారని మల్లారెడ్డి చెప్పారు.

అంతమంది ‘ఐటీ’ అధికారులు ఉప్పెనలా రావడంతో టీఆర్ఎస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాడుల్లో పాల్గొన్నవారిలో ఆదాయ పన్ను శాఖతో సంబంధం లేనివరు కూడా ఉన్నారని వారి అనుమానం. సీఆర్పీఎఫ్ సిబ్బంది రక్షణతో వచ్చిన అంతమంది అధికారులను ఐడెంటిటీని గుర్తించడం మల్లారెడ్డికి, బంధువులకు సాధ్యమయ్యే పనికాదని, గుంపులో గోవిందగా ఐటీయేతర అధికారులు వచ్చారని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రెవిన్యూ, ఆర్థిక నిఘా వంటి ఇతర విభాగాల అధికారులు వారిలో ఉండొచ్చని, అయితే వారెవరో స్పష్టంగా తెలియాలంటే వారి ఐడెంటిటీ బయటికి రావాల్సిన అవసరముందని అంటున్నారు. మల్లారెడ్డికి మద్దతుగా ఆయన ఇంటికి వెళ్లిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను సోదా అధికారులు వీడియోలు తీశారని, వారి ఉద్దేశమేమిటో తమకు అర్థం కావడం లేదని అంటున్నారు. దాడుల్లో పాల్గొన్న అధికారులు గుర్తింపు వివరాల కోసం కోర్టు తలుపు తట్టాలని కూడా అధికార పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు.