తెలంగాణ ఉద్యమకారుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జడ్పీ ఛైర్పర్సన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్లాల ఓదెలు దంపతులకు గురువారం ప్రియాంక గాంధీ కాంగ్రెస్ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రజలు, రాష్ట్ర అభ్యున్నతికి ఇటీవల తన పర్యటనలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని, సోనియా గాంధీ నాయకత్వాన్ని విశ్వసించి నల్లాల ఓదేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని..టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ నాయకత్వంలోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే ఆశతో ఆయన కాంగ్రెస్‌లోకి వచ్చారని తెలిపారు.
నల్లాల ఓదెలు 2009, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికలోనూ ఆయన గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్ విప్‌గానూ ఓదెలు పనిచేశారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో అగాధం పెరగడం.. అతడితో విభేదాల కారణంగానే ఓదెలు పార్టీని వీడినట్లు సమాచారం.