ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై గులాబీ గ్యాంగ్ గుస్సా అయ్యింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ‘ప్రగతిశీల నిర్ణయాలు తీసుకొని ముందుకి వెళ్తున్న రాష్ట్రాలకి సాయం అందించాల్సిన బాద్యత కేంద్రం మీద ఉంది. కానీ తెలంగాణ ఆశలపై కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లింది. తెలంగాణకు నిధులు లేవు. సుమారు 40 వేల కోట్లు ఆడిగినం, ఇచ్చింది ఏమి లేదు. దేశంలో తెలంగాణ అంతర్భాగమే .
అభివృద్ధి విషయంలో రాష్ట్రాల మధ్య పోటీని పెంచే విధంగా కేంద్ర నిర్ణయాలు ఉండాలి. ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ గురించి, భూగర్భ జలాల గురించి ఆలోచిస్తుంటే, మేము మిషన్ కాకతీయతో దానికి పరిష్కారం చూపిస్తున్నాం. దీనివల్ల భూగర్భజలాలు పెరిగినాయి ఎండిపోతున్న చెట్లు బ్రతికినాయి, పక్షులు వలసలు వస్తున్నాయి. వీటితో జీవం పోస్తున్నాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఏం చేయాలి అని మిగతవారు ఆలోచిస్తుంటే మనం 500 రెసిడెన్సిల్ స్కూల్స్ పెట్టినం. వీటన్నింటికోసం కేంద్రాన్ని నిధులు అందించమని అడిగినం కానీ కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు లేవు.
వ్యవసాయం,విద్య, వైద్యంపై దృష్టి పెట్టినట్టు కనిపించినా బడ్జెట్ గొప్పగా ఉంది అని భావన కలిపించలేక పోయింది. మొత్తంగా ఈ బడ్జెట్లో తెలంగాణ అడిగిన ఏ రంగానికి నిధులు కేటాయించకపోవడం సరికాదు. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి అని ఆలోచించే రాష్ట్రాలకు ఈ కేటాయింపులు ఆశాజనకంగా లేవు’ అని ఈటెల రాజేందర్ బడ్జెట్‌పై నిరాశను వ్యక్తం చేశారు.
ఇక అటవీశాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ‘ కేంద్ర బడ్జెట్లో పారదర్శకత లోపించింది, ఈబడ్జెట్ వల్ల రాష్ర్టానికి ఒరిగిందేమీలేదు. తెలంగాణలో అమలు అవుతున్న పలు కార్యక్రమాలకు కేంద్ర సాయం ఏమీలేదు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి తెలంగాణ ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు నిధుల ఊసే లేదు. తెలంగాణ ఆశలపై కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లింది.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల పక్షాన ఉండి ఉంటే బాగుండేదని ఎంపీ కవిత అభిప్రాయపడ్డారు. ‘మహిళా శిశుసంక్షేమానికి సంబంధించి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం బాధాకరం. రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం సరైంది కాదు’ అని ఆమె అన్నారు.
వీళ్లందరి అసంతృప్తి చూస్తుంటే బడ్జెట్ పై కేసీఆర్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
Telugu news trs disappointed on central budjet