కేసీఆర్ ఢిల్లీ టూర్.. పాపం కాంగ్రెస్, బీజేపీ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ ఢిల్లీ టూర్.. పాపం కాంగ్రెస్, బీజేపీ

September 7, 2021

తెలంగాణలో కురుస్తున్న జడివానలకు హైటెన్షన్ రాజకీయాలు తోడయ్యాయి. ఎవరికి ఎప్పుడు షార్ట్ సర్క్యూట్ జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ ఢిల్లీలో చేస్తున్న మంత్రాంగం ప్రధాన పార్టీల్లో కలకలం రేపుతోంది. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో, పలువురు కేంద్ర మంత్రులతో జరుపుతున్న భేటీల వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. తన బలబలాలతోపాటు ప్రత్యర్థుల బలాబలాలేమిటో క్షుణ్ణంగా తెలిసిన కేసీఆర్ ఢిల్లీ కేంద్రంగా మరోమారు జూలు విదిల్చి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

హుజూరాబాద్ ఎన్నికలు వాయిదా వేయించారా?


హస్తినలో టీఆర్ఎస్ భవనానికి శంకు స్థాపన కోసం రెండు రోజుల పర్యటనకు వెళ్లిన గులాబీ దళపతి వారం గడుస్తున్నా ఇంకా అక్కడే ఉండడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇంకొన్ని నెలలు వాయిదా పడ్డంతో ఢిల్లీ కేంద్రంగా ఏదో జరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మోదీని కేసీఆర్ కలిశాకే ఈ పరిణామం చేసుకోవడం కాకతాళీయం కాకపోవచ్చు. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ పడక్బందీగా ఢిల్లీ టూర్‌కు ప్లాన్ వేసుకున్నారని, అత్యంత సన్నిహిత మీడియా వర్గాలకు కూడా ఈ విషయం తెలియదని అంటున్నారు. మోదీ, అమిత్ షా వంటి నేతల అపాయింట్‌మెంట్ ఉన్నపళంగా దొరకడంతో తెరవెనక ఏదో సాగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఢిల్లీలో మోదీ సాయంతో ఎన్నికలు వాయిదా వేయించారని సాక్షాత్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించడం పరిస్థితికి అద్దం పడుతోంది. అంటే తెలంగాణలోని తమ నేతలను కాదని బీజేపీ అధిష్టానం కేసీఆర్‌తో దోస్తీ చేస్తోందని అర్థం చేసుకోవాలా?
కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం.. జాబితాలో హుజూరాబాద్ పేరు లేకపోవడం ఆయన రాజకీయ చాణక్యానికి ప్రతీక. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఇంకా పూర్తి కాలేదని, పండగల సీజన్ కాబట్టి ఇప్పట్లో ఎన్నికలు జరపలేమని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలు నమ్మశక్యంగా లేవు. ఒకపక్క సినిమాహాళ్లు, స్కూళ్లు సహా మొత్తం బార్లా తెరిచేసి.. ఎన్నికలకు మాత్రం వెనకంజ వేయడంలో సమంజసం కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‌కు ఇబ్బందేనని సర్వేలు చెప్పడంతో కేసీఆర్ చెయ్యాల్సిందంతా చేసేస్తున్నారని, దళితబంధు పథకంలోపాటు ఢిల్లీ టూర్ సహా మరెన్నో ఆ పనుల్లో ఉండొచ్చని భావిస్తున్నారు.

పార్టీల గొడవ ఎలా ఉన్నా బీజేపీని నమ్ముకుని తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్ పరిస్థితి ఈ పరిణామాలతో అగమ్యగోచరంగా మారింది. తాను తలచుకుంటే ఎంతవరకైనా వెళ్తానని, ఎవరికి ఎలా చెక్ పెట్టాలో తనకు తెలుసని కేసీఆర్.. ఈటల వంటి రెబల్స్‌కు ఢిల్లీ టూర్‌తో వార్నింగ్ ఇచ్చినట్లయింది. ఎన్నికల్లో ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే ఈటల ఓటమి పాపం బీజేపీ ఖాతాలోకే వెళ్లిపోయి ఆయన బలిపశువు అవుతారు.

గందరగోళంలో కాషాయ శ్రేణులు

ఢిల్లీలోని తమ అధినేతలతో కేసీఆర్ రాసుకుపూసుకు తిరగడం తెలంగాణ బీజేపీ నేతలకు జీర్ణం అస్సలు కావడంలేదు. ఆయన తమను అనరాని మాటలంటున్నా అధిష్టానం పట్టించుకోకుండా ఆయన కోరినవన్నీ చేసి పెడుతోందని వాపోతున్నారు. ఫలితంగా పార్టీ శ్రేణుల్లో నిరాశ నెలకొంటోందని, తాము టీఆర్ఎస్‌ను గట్టిగా విమర్శించలేకపోతున్నామని అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వ పనితీరు బావుందని సాక్షాత్తూ కేంద్ర మంత్రులే కితాబివ్వడం వారికి జీర్ణం కావడం లేదు. మోదీతో కేసీఆర్ భేటీ తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలు కేసీఆర్‌ను విమర్శించడానికి జంకుతున్నారు. అసలు మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్లు అంత సులభంగా దొరకడం వారికి కంటగింపుగా మారింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వంద కిలోమీటర్ల పాద యాత్ర నేపథ్యంలో కేసీఆర్‌తో ఢిల్లీలో తమ నాయకులు ఆత్మీయ భేటీలు జరపడం వెనక మతలబేంటో తెలియక ఆందోళన పడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతై, తాము బలం పుంజుకునేందుకు వచ్చిన అవకాశాన్ని అధిష్టానం ఉత్తిపుణ్యానికి చెడగొడుతోందని గొణుక్కుంటున్నారు.

దేశమంతా గమనించేలా..

రాష్ట్రంలో బీజేపీని చీల్చి చెండాడే కేసీఆర్ ఢిల్లీలో మాత్రం ఆ పార్టీ సర్కారుతో తన ప్రయోజనాల కోసం ఆచితూచి స్పందిన్నట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్ భవన్ శంకుస్థాపనను రాష్ట్ర ప్రజలు పండగలా జరుపుకోవాలని కోరడం, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి కూడా స్థలం కేటాయింపులు జరిపించుకోవడం వెనక పార్టీకి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే తీసుకొచ్చే ఉద్దేశం సుస్పష్టం. డీఎంకే, టీడీపీ వంటి దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్న దిగ్గజ ప్రాంతీయ పార్టీలకే ఢిల్లీలో కార్యాలయం లేని నేపథ్యంలో కేసీఆర్ శంకుస్థాపన సహజంగానే కనుబొమలు ఎగరేసేలా మారింది. కేసీఆర్ మదిలో ఎన్నేళ్లుగానో ఉన్న ఫెడరల్ ఫ్రంట్ సాకారం దిశగా ఇది తొలి అడుగులా మారే అవకాశమూ ఉంది.

బీజేపీకి టీఆర్ఎస్‌తో ఏం అవసరం?

మోదీ సర్కారుతో అవసరార్థం స్నేహంగా మెలగడం వల్ల రాష్ట్రంలో బీజేపీని నైతికంగా దెబ్బతీయాలన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ నాయకత్వం కూడా తన భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్‌ పట్ల మెతగ్గా వ్యవహరిస్తోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తన బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరి అని కాషాయదళం భావిస్తోంది. కరోనా విలయం, రికార్డు స్థాయికి పెరిగిన నిరుద్యోగం, పౌరసత్వం వివాదాల వల్ల వచ్చే ఎన్నికల్లో మోదీ గ్రాఫ్ పడిపోయే అవకాశముంది.
దక్షిణాదిలో కర్ణాటకలో తప్ప మరెక్కడా కమలం ఉనికి లేదు. బెంగాల్‌లో మమతా బెనర్జీ బలం పుంజుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీకి ఉన్న ఎంపీ సీట్లను కూడా ఆమె కొల్లగొట్టే అవకాశముంది. అటు కీలకమైన యూపీలో బీజేపీకి ఈసారి ఎదురుగాలి వీస్తుందని భావిస్తున్నారు. చివరకు మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో సైతం కాంగ్రెస్ బలం పుంజుకుంది. ఈ పరిణామాలతో ఆందోళన పడుతున్న మోదీ ఎందుకైనా మంచిదని కేసీఆర్, జగన్ వంటి ప్రాంతీయ నాయకులతో కలివిడిగా ఉంటున్నారు.

బీజేపీపై కాంగ్రెస్‌ను ఎగదోసి..

బీజేపీతో వ్యూహాత్మక సంబంధాల ద్వారా ఆ పార్టీని తన హవాకు అడ్డురాకుండా చూసుకోవాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. దీంతోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌కు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఆయన ఎంచుకుంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ రాష్ట్రంలో తిట్టుకుంటూ కేంద్రంలో మాత్రం చెయ్యి కలుపుతాయంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఇక్కడ గమనార్హం. హుజరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో వివాదాలు, విమర్శలు తమవైపు కాకుండా కాంగ్రెస్, బీజేపీలవైపు నెట్టేసి, అవి రెండూ కొట్టుకుంటుంటే తమాషా చూస్తూ గుంభనంగా తమ పని తాము చేసుకోకుపోవాలని టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
ఇదొక కోణమైతే టీఆర్ఎస్ బీజేపీతో కేంద్రస్థాయిలో పరోక్షంగా సానుకూల మెలగడం వల్ల గులాబీ మిత్రపక్ష ఎంఐఎంకి నైతికగా కొన్ని చిక్కులు ఎదురుకావొచ్చు. బీజేపీ, టీఆర్ఎస్ రహస్య అనుబంధం నిజమే అయితే దాని వల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలూ కలిగి, కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశముంది. బలం లేకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని, తమది అవకాశవాదం కాదని ఆ పార్టీ ప్రచారం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. తమ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా చెయ్యి కలిపే వర్తమాన రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న నగ్న సత్యాన్ని గమనిస్తే జరుగుతున్నదేమిటో సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

Trs KCR Delhi tour sparked speculation in Telangana political circles shocks bjp congress