Trs leader kcr national party likely announcement on Dussehra festival
mictv telugu

కేసీఆర్ జాతీయ పార్టీ అప్డేట్.. దసరా రోజున ప్రకటన!

September 28, 2022

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ స్థాయిలో మూడో ప్రయత్నాయం కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ కూటములకు భిన్నమైన సమాఖ్య భావన, అభివృద్ధి ఎజెండాతో ఆయన ముందుకొస్తున్నారని, భావసారూప్యమున్న పార్టీలను ఏకం చేస్తారని ఇప్పటికే ఎన్నో విశ్లేషణలు కూడా వచ్చాయి. జాతీయ స్థాయిలో ఆయన ఏర్పాటు చేయబోయే పార్టీపై తాజాగా రాజకీయవర్గాల్లో మరోసారి కదలిక వచ్చింది. కారు పార్టీ అగ్రనేత దసరా పండుగ రోజున.. అంటే అక్టోబర్ 5వ తేదీ మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీని ఏర్పాటును ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులతో కేసీఆర్ దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని, ప్రకటనే తరువాయి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఏ కార్యక్రమాన్నయినా మంచి ముహూర్తం చూసుకుని ప్రారంభించే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు దసరాకు మించిన మూహర్తం ఉండబోదని భావిస్తున్నారట. పండగ రోజున టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పేరును ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే ప్రకటన తర్వాత పార్టీ కార్యక్రమాలకు మరింత సమయం తీసుకుంటారని, డిసెంబర్ నాటికి జాతీయ స్థాయి కార్యాచరణ పూర్తవుతుందని అంటున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీకి భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అనే పేరును ఖరారు చేసినట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. ఢిల్లీలో పలు పార్టీల అగ్రనేతలతో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటారని కూడా కథనాలు వెలువడ్డాయి. మమతా బెనర్జీ, స్టాలిన్, శరద్ పవార్ వంటి ప్రాంతీయ స్థాయి నేతలతో చర్చలు కొలిక్కి రాకపోవడం, ఎజెండా తేలకపోవడంతో ఆయన సమయం కోసం వేచి చూస్తున్నట్లు కనిపిస్తోంది.

కేసీఆర్ ఇటీవల జరిగిన పలు పార్టీ సమావేశాల్లో, ఎన్నికల సభలో జాతీయ పార్టీ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ‘‘మీరందరు ఆశీర్వదిస్తే, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని తెలియజేస్తా. అధికారాన్ని అడ్డంపెట్టుకొని మతకల్లోలలు సృష్టిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతా. దేశమంతటా ఉచితంగా కరెంట్ వచ్చేలా ప్రభుత్వాన్ని నడిపిస్తా” అని అంటున్నారు.