ప్రభుత్వం చర్చలు జరపాలి.. ఆ ఒక్కటీ అడక్కండి: కేకే  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వం చర్చలు జరపాలి.. ఆ ఒక్కటీ అడక్కండి: కేకే 

October 14, 2019

 

ిి

తెలంగాణ ఆర్టీసీ సమ్మె వరుసగా పదోరోజూ ఉధృతంగా సాగుతోంది. కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేయగా, అధికార పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు ఆసక్తికర ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరపాలని కోరారు. అయితే ఆ ఒక్కటీ అడక్కు… అన్నట్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే డిమాండ్‌ను మినహాయించి మిగతా డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.

‘‘ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు నన్ను బాధించాయి .ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం చూపజాలదు. పరిస్థితులు చేయి దాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింప జేసి చర్చలకు సిద్ధం కావాలి.  ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్ల ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గతంలో గొప్పగా పరిష్కరించింది 44 శాతం ఫిట్‌మెంట్ ,16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టీఆరెఎస్ ప్రభుత్వానిదే. ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సీఎం ఇటీవలే తేల్చిచెప్పారు .అందుకు ఆయనను అభినందిస్తున్నా.

అద్దె బస్సులు,ప్రైవేట్ స్టేజి క్యారేజీల విషయంలో సీఎం చేసిన ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం గా మాత్రమే చూడాలి. నేను 2018 అసెంబ్లీ ఎన్నికల టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నాను. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రతిపాదనేది మా ఎన్నికల ప్రణాళికలో చేర్చలేదు. ఆర్టీసీనే కాదు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని మేనిఫెస్టోలో పేర్కొన లేదు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే విధానాన్ని (పాలసీ )మార్చుకోవాలని కోరడమే .ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయం..’ అని ప్రకటనలో తెలిపారు.