mictv telugu

కేటీఆర్ కొత్త రోల్ ట్రబుల్ షూటర్.. అస్త్రాలు సక్సెస్

October 3, 2018

ఎన్నికలు అంటేనే రాజకీయాలు. సమ్మతి కూడగట్టడం ఈజీ. అసమ్మతిని కడతేర్చడం చాలా కష్టం. అందుకే ప్రతి పార్టీలోనూ కొంతమంది ట్రబుల్ షూటర్లు ఉంటాయి. కాంగ్రెస్‌కు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్ ట్రబుల్ షూటర్లు. బీజేపీకి దాని అధినేత అమిత్ షానే పెద్ద షూటర్. సిద్ధరామయ్య వంటి లోకల్ పరిష్కర్తలూ ఉంటారు. ప్రాంతీయ పార్టీలకూ అలాంటి వారు ఉంటారు. టీఆర్ఎస్ నేత హరీశ్ రావు చాలా సమస్యలను షూట్ చేశారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ట్రబుల్ షూటర్‌గా మారారు.

rr

అధినేత కేసీఆర్ 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో దాదాపు పాతిక స్థానాల్లో అసమ్మతి రాగాలు మొదలయ్యాయి. కేసీఆర్‌కు అసమ్మతి నేతలను, రెబల్ అభ్యర్థులను కలసి మాట్లాడే సమయం లేదు. ఆయన వ్యూహప్రతివ్యూహాల రచనలో చాలా బిజీగా ఉన్నారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. హరీశ్ రావు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో కేటీఆర్ ట్రబుల్ షూటర్‌గా కొత్త పాత్ర పోషిస్తున్నారు. మొన్న స్టేషన్ ఘన్‌పూర్ అభ్యర్థి తాటికొండ రాజయ్యను తప్పించి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి టికెటివ్వాలని పంచాయతీ మొదలైంది. వ్యవహారంపై కేటీఆర్ దృష్టి సారించారు. కడియం అభిమానులను పిలిపించుకుని స్వయంగా మాట్లాడారు. ఒకరిని మార్చితే మరో చోట సమస్య మొదలవుతుందని, రాజయ్యను మార్చే ప్రసక్తే లేదని చెప్పారు. పార్టీ లక్ష్య సాధనకు పనిచేయాలని, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చిందని, మనలో మనకు తగవులు వద్దని నచ్చజెప్పారు. దీంతో వారు వెనక్కి తగ్గి, రాజయ్య గెలుపు కోసం పనిచేస్తామని చెప్పారు.

తాజాగా కేటీఆర్ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తలెత్తిన అసమ్మతి సమస్యనూ పరిష్కరించారు. కేటీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి జోక్యం చేసుకుని చర్చలు జరిపారు. అభ్యర్థి నోముల నర్సింహయ్యను వ్యతిరేకిస్తున్న కోటిరెడ్డిని అనునయించారు. ఈ రోజు దాదాపు రెండుగంటల పాటు చర్చలు జరిపారు. తర్వాత రెండు వర్గాలు ఏకమై కరచాలనం కూడా చేసుకున్నాయి. ఇదంతా కేటీఆర్ సముదాయింపుతోనే సాధ్యమైందని పార్టీ వర్గాలు అంటున్నాయి.. రాబోయే రోజుల్లో ఎక్కడైనా సమస్యలు వస్తే తాను రంగంలోకి వస్తానని కేటీఆర్ ఈ రాజీలతో సంకేతాలిస్తున్నారని చెబుతున్నాయి.