ఈనెల 21న టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం.. అందరు రావాలి:కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఈనెల 21న టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం.. అందరు రావాలి:కేసీఆర్

March 19, 2022

jyi

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 21న టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్ధాయి సమావేశం ఉంటుందని, ఆ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవ‌ర్గ స‌భ్యులు, జిల్లా అధ్యక్షులు, జ‌డ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు స‌మితుల జిల్లా అధ్యక్షులు త‌ప్పనిస‌రిగా హాజ‌రు కావాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు.

ఈ నేపథ్యంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ సర్కార్ సమర శంఖం పూరించింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు. అందుకోసం ఈనెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించినున్నట్లు కేసీఆర్ ప్రక‌టించారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్న ఈ సమావేశంలో కేంద్రంపై ప్రత్యేక్ష సమరానికి రూపకల్పన చేయనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో యాసంగి వరిధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేపట్టేందుకు ఈ సమావేశంలో ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్ సభలో, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.