దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో వేడి పెరిగింది. విమర్శలు తీవ్రమయ్యాయి. అటు అధికార టీఆర్ఎస్, ఇటు విపక్ష కాంగ్రెస్, బీజేపీల నేతలు మ్మెత్తిపోసుకుంటున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ప్రత్యర్థులు బలబలాలపై మరింత స్పష్టత రావడంతో విమర్శలు కూడా అనుకున్న లక్ష్యాన్ని మిస్ కాకుండా ఛేదించేలాగా కొనసాగుతున్నాయి.
‘కాంగ్రెస్, బీజేపీ రెండూ దొందే. తెలంగాణ అభివృద్ధికి అవి ఒరగబెట్టిందేమీ లేదు. అందుకే ఆ రెండు జాతీయ పార్టీలను తిరస్కరించి, మళ్లీ మా పార్టీకే పట్టం కట్టండి..’ అని గులాబీ పార్టీ నేత, మంత్రి హరీశ్ రావు మొన్నటి వరకు ప్రజలను కోరుతూ వచ్చారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా సవతి తల్లిలా ప్రవర్తిస్తోందని కాషాయదళంపై దాడి చేశారు. తాజాగా ఆయన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. బీజేపీని కాకుండా ప్రధానంగా హస్తం పార్టీపైనే విరుచుకు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కనుక దానిపైనే దాడి చేస్తుండడం సహజమే కదా అనిపించొచ్చు. కానీ ఆయన పదేపదే కాంగ్రెస్‌నే విమర్శించడం, బీజేపీని ‘లైట్’ తీసుకున్నట్లు మాట్లాడడం పలు విశ్లేషణలకు ఆస్కారం కల్పిస్తోంది.
ఉమ్మడి రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు చేసిన మేలేదీ లేదన్నది హరీశ్ రావు ప్రధాన ఆరోపణ. దాన్నే ఆయన దుబ్బాక ఎన్నికల్లో పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఫార్మాసిటీలో ఉద్యోగాలు, కాళేశ్వరం నీళ్లు, 24 గంటల కరెంట్ వంటి ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. ‘24 గంటల కరెంటు, ఎకరానికి 10 వేలు ఇచ్చింది మేమే. మీరు మావైపా, కాంగ్రెస్ వైపా?’ అని ప్రజలను నేరుగా అడుగుతున్నారు. బీజేపీ పేరును పెద్దగా ప్రస్తావనకు తీసుకురాకుండానే ఆయన ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో తాము గట్టి పోటీ ఇస్తామని బీజేపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో హరీశ్ ఆ పార్టీని పట్టించుకోకపోవడం విశేషం.
కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఉన్న బలమైన నేపథ్యాన్ని, ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే హరీశ్ సహా ఇతర టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌నే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మరోపక్క.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కోసం తీసుకెళ్తున్న రూ. 40 లక్షల డబ్బు దొరకడంతో ఆ పార్టీ చిక్కుల్లో పడిపోయింది. 2018 ఎన్నికల్లోనూ పోటీ చేసిన రఘనందన్ రావు దాదాపు 14 శాతం ఓట్లతో(22,595) మూడో స్థానంలో నిలిచారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు బలంగా ఉన్నా రెండేళ్లుగా ప్రజలు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని, అదే తమకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. అయితే దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వారసురాలిగా బరిలో ఉన్న ఆయన భార్య సుజాతపై ప్రజల్లో సహజంగానే సానుభూతి ఉంటుందని, విపక్షాల ప్రభావం ఉండదని టీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు స్థానిక అంశాల చుట్టూ తిరుగుతాయి కనుక బీజేపీ ప్రస్తావించే అయోధ్య, కశ్మీర్ వంటి జాతీయస్థాయి రాజకీయాలు పనిచేయవని, కాంగ్రెసే తమ ప్రధాన అభ్యర్థి అని విమర్శలకు పదునుపెడుతోంది. టీడీపీ అభ్యర్థి ఇల్లెందుల రమేశ్‌తోపాటు మిగతా అభ్యర్థుల ప్రభావం నామమాత్రంగా కూడా లేకపపోవడం, కమ్యూనిస్టు పార్టీల తెరపై లేకపోవడంతో ఇప్పుడు దుబ్బాక్ వార్ టీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు మధ్యే అని భావించాల్సిన పరిస్థితి నెలకొంది!