మెట్రో రైలు కదిలింది.. కాంగ్రెస్ రైలు పరిగెత్తింది.. - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రో రైలు కదిలింది.. కాంగ్రెస్ రైలు పరిగెత్తింది..

November 29, 2017

అటు హైదరాబాద్ మెట్రో రైలు మొదలైందో లేదో ఇటు విమర్శల రైళ్లు కూడా అంతకంటే వేగంగా పరుగులు పెట్టాయి. మెట్రో టిక్కెట్ల ధరలు ప్రజలకు అందనంత స్థాయిలో ఉన్నాయని, వాటిని తగ్గించకపోతే ఆందోళన చేస్తామని కాంగ్రెస్ హెచ్చరించింది.  టీఆర్ఎస్ ప్రభుత్వ ఆలస్యం చేయడం వల్లే మెట్రో నిర్మాణం భారీగా పెరిగిందని, అందుకు ప్రతిగా మెట్రో ధరల భారాన్ని సర్కారే భరించాలని డిమాండ్ చేసింది.

ఈ అంశంపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్  మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన ప్రాజెక్టు మెట్రో ప్రాజెక్టు. దీన్ని మెరుగైన రవాణా సౌకర్యం కోసం మెట్రో రైలు తీసుకొచ్చారు. వేగవంతమైన ప్రయాణం, తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలన్నదే మెట్రో లక్ష్యం. కానీ ఇప్పుడు ప్రకటించిన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటితో పేద ప్రజలు, చిరువ్యాపారులు, సగటు ఉద్యోగులు ప్రయాణించలేరు.

ఢిల్లీలో మెట్రో రైలు చార్జీలు పెంచడంతో మూడున్నర లక్షల మంది ప్రయాణికులు దూరమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో 90శాతం పేదలే ఉన్నారు.. మెట్రో ధరలు తగ్గించాలి. మెట్రో ఆలస్యానికి కారణం టీఆరెస్సే. జాప్యం వల్ల  నాలుగు వేల కోట్ల అదనపు భారం పడింది. మొత్తం 14వేల కోట్లలో టీఆర్ఎస్ సర్కారు మూడేళ్లలో మెట్రోకు కేటాయించింది 370కోట్లు మాత్రమే. మిగితా నిధులన్నీ కాంగ్రెస్ హయాంలోనే విడుదల చేశారు’ అని ఆయన అన్నారు. మహిళలు మంత్రివర్గంలో లేకుండా మంత్రివర్గం మూడేళ్ళు నడిపిన ఘనత టీఆర్ఎస్ సర్కారుదేనని మండిపడ్డారు.  

కేటీఆర్ ఏ  హోదాలో ప్రధాని పక్కన కూచుండు..

తొలి మెట్రో రైలు ప్రయాణంలో మంత్రి  కేటీఆర్‌ ఏ హోదాతో ప్రధానమంత్రి పక్కన కూర్చున్నారని కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. అన్ని కార్యక్రమాల్లో కేసీఆర్‌కు కొడుకు తప్ప ఇంకెవరూ కనిపించడం లేదని మండిపడ్డారు. మోదీని విమర్శిస్తూ.. ‘మోదీకి హైదరాబాద్‌కు వచ్చాక సర్దార్ పటేల్ గుర్తుకొచ్చాడు కానీ జ్యోతిరావు పూలే గుర్తుకురాలేదు. ఇది బీసీలను అవమానించడమే .. వచ్చే ఎన్నికల్లో బీసీలు ఈ సంగతి మరిచిపోరు.. నీకు సరైన గుణపాఠం చెబుతారు.. కేసీఆర్ కూడా కనీసం పూలే వర్ధంతికి ప్రభుత్వపరంగా ప్రకటనలు ఇవ్వకపోవడం దారుణం..’ అని వీహెచ్ విమర్శించారు.