టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కూల్చివేత - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కూల్చివేత

September 17, 2020

gfr

వరంగల్ లో ఉన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ క్యాంపు ఆఫీస్ ను డీఆర్‌ఎఫ్‌ బృందం కూల్చేసింది. నగరంలో జరుగుతోన్న నాలాల విస్తరణలో భాగంగా ఈ కూల్చివేతను చేపట్టారు. వరంగల్‌ భద్రకాళి చెరువు నుంచి హంటర్‌ రోడ్‌ ప్రధాన రహదారికి వచ్చే వరదనీటి కాలువపై ఐదేళ్ల క్రితం అరూరి రమేశ్‌ తన క్యాంపు ఆఫీస్ నిర్మించారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్‌ నగరం వరద నీటిలో మునిగింది. ఈ క్రమంలో రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్‌ వరంగల్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా నాలాల విస్తరణ జరపాలని, వాటిపై చేపట్టిన నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. 

దీంతో నగరంలో కీలకమైన వరద నీటి కాల్వలను విస్తరించేందుకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ బృందం వరంగల్, హన్మకొండ నగరాల్లో నాలాలకు అడ్డుగా ఉన్న కట్టడాలను గుర్తించి కూల్చివేయడం మొదలెట్టింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ క్యాంప్ ఆఫీస్ నాలాకు అడ్డుగా ఉందని సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనిపై ఎమ్మెల్యే‌ స్పందిస్తూ.. తన ఆఫీస్ నాలాకి అడ్డుగా ఉంటే కూల్చివేసేందుకు సిద్ధమని ప్రకటించారు. బుధవారం ఉదయం పోలీసు బందోబస్తు మధ్య డీఆర్‌ఎఫ్‌ బృందం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను కూల్చేసింది.