TRS MLA Balka Suman lashed out at BJP over the purchase of TRS MLAs.
mictv telugu

మా ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి లాంటోళ్లు కాదు.. సుమన్

October 27, 2022

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ నలుగురు వ్యక్తులు పోలీసులకు అడ్డంగా దొరికిపోవడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ పార్టీ యువ నేత, చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌజ్ పై సైబరాబాద్ పోలీసులు దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన వ్యవహారంపై బుధవారం రాత్రి సుమన్ స్పందించారు.

భారీగా డబ్బు, కాంట్రాక్టులు ఎరగా చూపి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని , తెలంగాణ సమాజం అమ్ముడుపోయేది కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ ఈ విషయాన్ని గ్రహించాలని హెచ్చరించారు. మునుగోడులో ఓడిపోతామనే బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఉద్యమకారులను ఎప్పటికీ కొనుగోలు చేయలేరని చెబుతూ.. ప్రలోభాలతో చిల్లర వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌తో పెట్టుకుంటే బీజేపీ కొరివితో తలగోక్కున్నట్లేనని ఆయన హెచ్చరించారు. అంగట్లో సరుకులా రాజగోపాల్ రెడ్డి లాంటి వారిని మీరు కొనచ్చునని.. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కేంద్రం కుట్రలను బయటపెట్టారని బాల్క సుమన్ తెలిపారు

సీఎం కేసీఆర్‌పైన, టీఆర్‌ఎస్‌పైన, తెలంగాణపైన కుట్రలు బీజేపీని తెలంగాణ సమాజం కూకటివేళ్లతో సహా పెకిలించాలని పేర్కొన్నారు. కేంద్ర రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారని.. మోదీని గద్దె దింపుతారని దిల్లీ పెద్దలకు భయం పట్టుకుందని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు.