టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేవాళ్లకే దళితబంధు ఇస్తామని.. ఇందులో ఎలాంటి దాపరికం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. గురువారం సిద్ధిపేట జిల్లా, కొమురవెల్లిలో అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. దళితబంధు ఎంపికపై అధికారులకు సూచనలు ఇచ్చారు. తెలంగాణ సోయ ఉన్నవాళ్లకే పథకాలు వర్తింపచేయాలన్నారు. కేసీఆర్, టీఆర్ఎస్కు ఓట్లు వేసేవాళ్లకే దళితబంధు ఇవ్వాలన్నారు.
అక్కడున్న ఓ సర్పంచ్‌తో మాట్లాడుతూ.. ” తెలంగాణ సోయి ఉన్నోళ్లు. అర్థమైంది కదా. ! ఎలాంటి దాపరికం లేదు.. ఎందుకు ఉండాలి? అంతకు ముందు నీళ్లు లేకుండె. ఇప్పుడు ఇస్తున్నాం. కరెంటు కూడా రాకుండె. కానీ ఇప్పుడు ఇస్తున్నాం. ఎదిగిన ఆడబిడ్డల పెళ్లిళ్లకు సర్కారు పైసలిస్తోంది. గర్భిణీలకు రూపాయి ఖర్చు లేకుండా ప్రసూతి చేస్తున్నాం. ఉల్టా పైసలు కూడా ఇస్తున్నాం కదా.. ! ఇవన్నీ నష్టమా, లాభమా తెలంగాణకు. అందుకే ఆ సోయున్నోళ్లుంటే పెట్టియ్యి. ఆ సోయి లేకుంటే పెట్టకు. కేసీఆర్‌కే ఓటు వేస్తాం. తెలంగాణ గెలిపిస్తాం. అనేటోళ్లు ఉంటేనే పెట్టు. ఓపెన్ సీక్రెట్ ఇది. దాపరికం లేదు.” అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై విపక్ష నేతలు మండిపడుతున్నారు.