Trs mlas purchase case Ramachandra Bharati real story
mictv telugu

రామచంద్ర భారతి ఇల్లు, భార్య.. అంతా ష్.. గప్‌చుప్..

November 3, 2022

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక నిందితుడైన రామచంద్ర భారతి చాలా ‘ప్రత్యేకమైన మనిషి’. పైకి కాషాయ వస్త్రాలతో ఆధ్యాత్మిక ముసుగు, లోపల పక్కా క్రిమినల్ మైండ్. బీజేపీ కార్యకర్తనని చెప్పుకునే ఆయన ఆ జీవితం ఓ ‘మూసిన పుస్తకం.’ తెలంగాణ పోలీసులు నమోదు చేసిన వివరాల్లో ఆయన హరియాణాలోని ఫరీదాబాద్‌వాసి అని, పూజారి అని పేర్కొన్నారు. అంతే తప్ప ఆయన వ్యక్తిగత వివరాలేవీ పెద్దగా వెలుగులోకి రాలేదు. వందల కోట్ల బేరసారాల్లోకి దిగిన జాతీయ పార్టీకి ‘చేరిక’లతో అండదండగా నిలుస్తున్నట్టు గప్పాలు కొట్టిన ఈ రాజకీయ పురోహితుడి అసలు కథేమిటి? ఈ సంసారం, భార్య, ఇల్లు, గుట్టుమట్లు గోలేమిటి?
కొత్త అపార్టుమెంటులో ఫస్ట్ ఫ్లోర్‌లో..

ఫరీదాబాద్ సెక్టార్ 31లోని ఇటీవల నిర్మించిన కొత్త అపార్ట్‌మెంటులో భార్యతో కలసి ఉంటున్నాడు ఈ 33 ఏళ్ల స్వామీజీ. ఇంటి విస్తీర్ణం 2 వేల అడుగులు. ఖరీదు కోటిన్నరపైనే. అరెస్టయినప్పట్నుంచి ఈ ఇంటికి తాళం కనిపిస్తోంది. భారతి అసలు పేరు వీకే సతీశ్ శర్మ. అర్చక వృత్తిలోకి దిగాక రామచంద్ర భారతిగా పేరు మార్చుకున్నారు. కర్ణాటకలో పుట్టి పెరిగి కేరళలి కాసరగోడ్‌లో కొన్నేళ్లు ఉన్నారు. ఇంటికి కూతవేటు దూరంలో దక్షిణభారతీయులు నిడిపే గుడిలో ఆయన అర్చకుడిగా పనిచేస్తున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ఓ మఠానికి అధిపతి అని వస్తున్న వార్తలు నిర్ధారణ కాలేదు.
మంచివాడేనంట..

‘‘ఆయన పొద్దున బయటికి వెళ్లి, సాయంత్రం వస్తారు. వాళ్లు ఇటీవలే ఆ ఇంట్లోకి వచ్చారు. వాళ్ల గురించి ఏమీ తెలియదు. ఎవర్నీ ఇబ్బందిపెట్టేవారు కాదు. ఆయన అరెస్టయ్యాక భార్య తాళం వేసుకుని వెళ్లిపోయింది’ అని పొరుగువాళ్లు చెప్పారు. అపార్టుమెంటులో ఆయన ఇంటి పార్కింగ్ ప్లేసులో రెండు ఎస్‌యూవీ వాహనాలు, ఒక మోటార్ బైకు ఉన్నాయి. ఓ ఎస్‌యూవీ వాహనంపై తెలంగాణ నంబర్ ప్లేటు ఉంది. భారతి ఇంటికి 200 అడుగుల దూరంలోనే ఉన శ్రీకృష్ణ నవగ్రహాలయంలో పనిచేస్తున్నారు. దీన్ని శ్రీకృష్ణ సేవా సమితి నిర్వహిస్తోంది. తమకు దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నట్లు సమితి ఉద్యోగి ఒకరు చెప్పారు. భారతి ఏడాది కిందటే గుడిలో చేరినట్టు సమితి కార్యదర్శి గోపకుమార్ తెలిపారు. ‘అతడు చాలామంచివాడు. ఆయన భార్య ఢిల్లీ వాసి. ఇది రాజకీయాల కేసు కాబట్టి ఇంతకు మించి చెప్పలేం’ అని తెలిపారు.


పలుకుబడిపై అనుమానం..

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొరికిన ఆడియోల్లో భారతి తనకు చాలా పలుకుబడి ఉన్నట్లు చెప్పుకున్నారు. కర్ణాటక బీజేపీ నేత బీఎల్ సంతోష్ బాగా క్లోజ్ అని, కేంద్రంలోని పెద్దలతో కలసి ప్రాబ్లమ్ రాకుండా మేనేజ్ చేస్తానని ఆయన చెప్పారు. అంత గొప్పలు చేసిన భారతి గుడిలో పొట్టకూటి కోసం అర్చన చేసుకుంటున్నట్లు కనిపించం గమనార్హం. ఖరీదైన ఇంట్లో నివసిస్తూ గుడిలో పూజారిగా పనిచేస్తున్న భారతి రియల్ స్టోరీ ఆయనే విచారణలో చెబితే తప్ప బయటపడే అవకాశం లేదు.