Trs mlas purchase deal second audio leak
mictv telugu

ఫామ్‌హౌజ్ 2వ ఆడియో.. ఎవరెవరు? ఎన్నికోట్ల?

October 28, 2022

వెబ్ సిరీస్‌లా ఫామ్‌హౌజ్ ఆడియో సిరీస్! నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర వేసినట్లు భావిస్తున్న వ్యవహారంలో రెండో ఆడియో బయటికొచ్చింది. తొలి ఆడియోలో రామచంద్ర భారతి, బ్రోకర్ నంద కుమార్, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుకోగా, తాజా ఆడియోలో భారతి, సింహయాజీ, నందకుమార్ ముట్చటించారు. పార్టీ ఫిరాయించబోయే ఎమ్మెల్యేలకు ఎంత డబ్బు ఇవ్వాలో, ఎవరి తీరు ఏమిటో చర్చించుకున్నారు. నిందితుల మధ్య సాగిన ఆ ఫోన్ సంభాషణ సాక్ష్యాధారాలకు పనికొస్తుందా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

ఆడియోలో ఉన్న ప్రకారం.. నలుగురు ఎమ్మెల్యేలు జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, పైలెట్ రోహిత్ రెడ్డికి 100 కోట్లు, మిగతా వారికి నామినల్ అమౌంట్ ఇస్తే సరిపోతుందని నందకుమార్ చెప్పారు. ఒక్కొక్కరు 100 కోట్లు అడుగుతున్నట్లు చెప్పారు. పైలెట్ భయపడుతున్నారని, పార్టీ(టీఆర్ఎస్) సీరియస్‌గా ఉండడమే దీనికి కారణమని చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఫిరాయింపులకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకున్నారు. మధ్యవర్తిగా భావిస్తున్న బీఎ సంతోష్ పేరు రెండో ఆడియోలోనూ ఉంది. ఈ వ్యవహారంలో పైలట్ కీలక వ్యక్తి అని చెప్పుకున్నారు. రోహిత్ తనతో పాటు నలుగురిని తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాట్లాడుకున్నారు. రాష్ట్ర నాయకులతో సంబంధం లేకుండా నేరుగా ఢిల్లీ పెద్దలను కలిపిస్తామన్నట్లు ఆడియోలో ఉంది. మునుగోడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇది జరిగిపోతుందని రామచంద్రభారతి చెప్పినట్లు ఉంది.