Trs mlc kalvakuntla Kavitha warns Nizamabad mp Dharmapuri Aravind on her joining in congress
mictv telugu

చెప్పుతో కొడతా.. అరవింద్‌కు కవిత వార్నింగ్

November 18, 2022

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తను పార్టీ మారతానంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేసినట్లు అరవింద్ చెప్పడంపై కవిత భగ్గుమన్నారు. అరవింద్ బురదలాంటోడని, అతని మీద రాయివేస్తే మనమీదే బురదపడుతుందని అన్నారు. ఆమె శుక్రవారం నిజామాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ అరవింద్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘‘అరవింద్ కాంగ్రెస్ మద్దతుతో యాక్సిండెంటల్‌గా ఎంపీ అయ్యాడు. అతడు మాట్లాడే భాషతో నిజామాబాద్ పరువు పోతోంది. పార్లమెంట్‌లో ఎంపీలు సగటున 20 డిబేట్లలో పాల్గొంటే అరవింద్ కేవలం ఐదు చర్చల్లో మాత్రమే పాల్గొన్నాడు. పార్లమెంట్‌లో ఏ ఒక్క అంశంపైనా గొంతెత్తి మాట్లాడలేదు. పసుపు బోర్డ్ తెస్తామని బాండ్ పేపర్ రాసి రైతులను మోసం చేశాడు. రేపటి నుంచి పోలీస్ స్టేషన్‌లలో రైతులు అతనిపై చీటింగ్ కేసులు పట్టబోతున్నారు. అతని ఫేక్ డిగ్రీపై నేను పార్లమెంటుకు ఫిర్యాదు చేస్తా’’ అని అన్నారు. ‘‘నేను కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు కాంగ్రెస్ సెక్రటరీ చెప్పాడంట. అసలు అరవింద్ ఎందుకు కాంగ్రెస్‌కు టచ్‌లో వున్నారు?’ అని ఆమె ప్రశ్నించారు.

అరవింద్‌వి చిల్లరమాటలని, అతని భాష చూస్తుంటే ఇలాంటి రాజకీయాలు అవసరమా అని బాధ కలుగుతోందన్నారు. ‘‘నేను సమస్యల మీద మాట్లాడతాను.. వ్యక్తుల ఎపుడూ మీద మాట్లాడలేదు. కానీ అరవింద్ తీరు చూసి మాట్లాడక తప్పడం లేదు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదు. మళ్లీ నా గురించి, పార్టీ మారడం గురించి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా! ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతున్నా. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి పోటీ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేను ఖర్గేతో మాట్లాడాను అనేది శుద్ధ తప్పు. తెలంగాణ వాసన లేని పార్టీల్లో నేనెలా చేరుతాను? నా జీవితం నేను నమ్మే ఏకైక నాయకుడు కేసీఆర్. నా రాజకీయ ప్రయాణం కేసీఆర్‌తోనే’’ అని ఆమె అన్నారు.

బీజేపీ నుంచి తనకు ఆఫర్లు వచ్చిన మాట నిజమేనని, షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడంపై మాట్లాడారని తెలిపారు. తెలంగాణలో షిండే మోడల్ నడవదని, ఈడీ దాడులకు భయపడకుండా దేశ రాజకీయాల్లోకి కచ్చితంగా వెళ్తామని చెప్పారు. అరవింద్ గురించి ఇంకోసారి మాట్లాడనని, అతడింకోసారి మాట్లాడితే మెత్తగా తంతామని హెచ్చరించారు.