జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ అంశం కాస్త పెద్ద చర్చకు దారి తీసింది. బాలిక రేప్ కేసులోని మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లు ఉన్నారు. వీరిలో వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ మహ్మద్ మసీవుల్లాఖాన్ కొడుకు కూడా ఉన్నాడు. దీంతో వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని మసీవుల్లాను టీఆర్ఎస్ పార్టీ ఆదేశించింది. ఈ బాధ్యతను హోంమంత్రి మహమూద్ అలీకి పార్టీ అప్పగించింది. పదవి నుంచి తప్పుకోవాలని మసీవుల్లాకు హోంమంత్రి సూచించారని తెలిసింది.అయితే, ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది.
బాలికపై గ్యాంగ్ రేప్ కోసం వాడిన తెలుపు రంగు ఇన్నోవా కారుపై ప్రభుత్వ వాహనం అని ఉన్నట్లుగా పోలీసులు తేల్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ కారు వక్ఫ్ బోర్డు చైర్మన్ వినియోగిస్తున్న వాహనమా లేదా అనే దానిపై స్పష్టత రాలేదని పోలీసులు చెప్పారు. 2019లోనే కొన్న ఆ ఇన్నోవా వాహనం సనత్ నగర్ ప్రాంతానికి చెందిన దినాజ్ జహాన్ పేరుతో ఉంది. వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కేసులో నిందితుడైన ఓ బాలుడి తండ్రి ఆ వాహనాన్ని లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కారు టెంపరరీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వివరాలు ఇవ్వాల్సిందిగా ఆర్టీఏ అధికారులకు పోలీసులు లెటర్ రాశారు.