ఎవరి లెక్కలు వారివి... ఎదుటి పక్షంపైనే నజర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎవరి లెక్కలు వారివి… ఎదుటి పక్షంపైనే నజర్

October 22, 2018

ఎవరెన్ని సీట్లు గెలుస్తారనే దానిపై ఎవరి లెక్కలు వారికున్నాయి. ఒక్కో పార్టీది ఒక్కో థీయరీ. ఒక్కో నాయకుడు ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వంద సీట్లు ఖాయమని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అనడమే కాదు నియోజకవర్గాల వారిగా శాతాలు లెక్కగట్టి మరీ చెబుతున్నారు. ఇక కూటమి నాయకులు అంత సీన్ లేదని అత్తెసరు సీట్లు మాత్రమే వస్తాయని బల్ల గుద్దీ మరీ చెబుతున్నారు. పొత్తుల్లో ఎవరికి ఎన్ని స్థానాలు కేటాయించు కోవాలో తేల్చుకోక ముందే కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి రావడం ఖాయమని అంటోంది. పొత్తుల్లో ఉన్న మిత్రులు తమకు సీట్లు కేటాయించేది ఆలస్యం అన్నీ సీట్లు గెలిచి నేరుగా అసెంబ్లీలోకే అడుగు పెడతామంటున్నారు.

ఇక పొత్తుల గురించి మాట్లాడితే త్వరలో తేలుస్తామంటున్నారు. ఇప్పటి వరకు కనీసం టీజర్ కూడా  కాంగ్రెస్ పార్టీ విడుదల చేయలేదు. గ్రాండ్ రిలీజ్ అని అంటోంది. ఎన్నికల కౌంటర్ సెంటర్ వద్ద బోల్తా పడుతోంది. లేక సూపర్ డూపర్  హిట్ సాధించి అధికారంలోకి వస్తుందా అనే డౌట్ అందరికీ ఉన్నట్లుగానే వారికీ ఉన్నట్లుంది. అధికార టీఆర్ఎస్ మాత్రం రోజుకో రీతిలో ప్రచారంలో ముందుకు దూసుకెళ్తోంది. కొత్త ఎత్తులు, జిత్తులు పారిస్తోంది. విపక్షాలకు అందని రీతిలో ఇప్పటికైతే రేసులో ముందు వరుసలోనే ఉన్నారు. ఏయే నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు వస్తాయి. ఏయే జిల్లాల్లో ఎన్ని స్థానాలు ఖాయంగా గెలుచుకుంటామో కూడా పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఇందులో అంచనాలు, అతి అంచనాల సంగతి ఎలా ఉన్నా విపక్షాలతో కేసీఆర్ మాంచి మైండ్ గేమ్ ఆడుతున్నారనే అభిప్రాయం జనాల్లో ఉంది. కాంగ్రెస్ నాయకులు పోటీ చేసే స్థానాల్లో కూడా ఎన్ని ఓట్లు వస్తాయో కూడా చెబుతున్నారు. ఈ లెక్కన అన్ని నియోజకవర్గాలపై మంచి పట్టు సాధించారు టీఆర్ఎస్ అధినేత. ఇక కాంగ్రెస్ నాయకులూ సర్వేలు చేసి అంచనాలు వేస్తున్నారు. గతంలో టీఆర్ఎస్‌కు 60 స్థానాల వరకు వచ్చేవని, ఇప్పుడా గ్రాఫ్ అమాంతం 30కి పడిపోయిందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ దాని మిత్ర పక్షాల నాయకులు లెక్కలు వేసి మరీ అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాహుల్ గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ నాయకులు కాస్త జోష్ నింపుకున్నట్లు తెలుస్తోంది. రేపో మాపో మిత్రలకు ఎన్ని స్థానాలు కేటాయించే విషయంపై కూడా క్లారిటీ ఇస్తామని అని చెబుతున్నారు. ఈ లోపుగా కూటమికి మొత్తంగా 70 స్థానాలొస్తాయని అంచనా వేసుకుంటున్నారు. విడివిడిగా చూసుకుంటే తమకు కేటాయించిన అన్నిస్థానాలు గెలుస్తామని అంటున్నాయి మిత్ర పక్షాలు. ఎవరికెన్ని స్థానాలిస్తారో, ఎవరెన్ని గెలుస్తారో లెక్కలు తేలినప్పుడు తెలుస్తుంది. ఈ లోగా  సర్వేలు, అభ్యర్థులు.. ఓటర్లను ఆకట్టుకునే కార్యక్రమాల్లో ఉందామని అనుకుంటున్నారట. ఎవరి లెక్కల సంగతి ఎలా ఉన్నా తమ కంటే కూడా వైరీ పక్షాలకు ఎన్ని సీట్లు వస్తాయో బాగానే అంచనా వేసుకుంటున్నాయి పార్టీలు. తాము సొంతంగా సాధించే సీట్లు, జనంలో తమ బలం ఎంత ఉందో బాగా అంచనాలేసుకుని ఓ అడుగు ముందుకేస్తే మంచిదనేది జనాభిప్రాయం.