ఉప ఎన్నికల్లో తిరుగులేని టీఆర్ఎస్ పార్టీ - MicTv.in - Telugu News
mictv telugu

ఉప ఎన్నికల్లో తిరుగులేని టీఆర్ఎస్ పార్టీ

October 24, 2019

Trs party continuously wining in by polls

టీఆర్ఎస్ పార్టీకి ఉపఎన్నికలలో తిరుగులేదని మరోసారి నిరూపితమైనది. ఈరోజు వెల్లడించిన హుజూర్‌నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితాల్లో 43వేల భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయఢంకా మోగించారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా పిలువబడిన హుజూర్ నగర్ లో తొలిసారి గులాబీ జెండా రెపరెపలాడిచారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా సాధ్యం కానీ మెజారిటీతో గెలుపొందారు.

టీడీపీ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యత్వానికి కేసీఆర్ రాజీనామా చేసి 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అనంతరం జరిగిన సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో కేసీఆర్ 58వేల పైచిలుకు మెజారిటీతో అధికార టీడీపీ పార్టీ అభ్యర్థిపై గెలుపొందారు. ఇదే టీఆర్ఎస్ పార్టీకి మొదటి విజయం. అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎన్నో సందర్భాల్లో ఉపఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేక సార్లు పదవులకు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.

2006, 2008 ఉప ఎన్నికల్లో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందారు. 2004లో సిద్ధిపేట నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో హరీష్ రావు గెలుపొందారు. ఆ తరువాత 2008, 2010 సిద్ధిపేట ఉపఎన్నికల్లో హరీష్ రావు విజయ ఢంకా మోగించాడు. 2010లో సిరిసిల్ల నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో కేటీఆర్ 68219 భారీ మెజారిటీతో గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు జరిగిన ఉపఎన్నికల్లో కొన్నింటిలో టీఆర్ఎస్ పార్టీ కొన్ని స్థానాల్లో ఓడినప్పటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఏ 

ఒక్క ఉపఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోలేదు.

2015లో వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొందిన కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో ఈ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించారు. 2016లో నారాయణ ఖేడ్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో నారాయణ ఖేడ్ నుంచి గెలిచిన కాంగ్రెస్ నేత పట్లోళ్ల కిష్టారెడ్డి మృతితో ఈ స్థానానికి 2016లో ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డి విజయం సాధించాడు. అదే సంవత్సరం పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. పాలేరు స్థానం నుంచి పోటీచేసి గెలిచిన రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతితో ఈ ఉపఎన్నిక అనివార్యమైనది. తాజాగా హుజూర్ నగర్‌కు జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఉపఎన్నికల్లో తిరుగులేని పార్టీగా నిలిచింది.