TRS Party Working President and Minister KTR will visit Munugode constituency Today
mictv telugu

దత్తత హామీ.. నేడు మునుగోడుకు మంత్రి కేటీఆర్

December 1, 2022

టీఆర్ఎస్ ను గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని బైపోల్ ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీపై మంత్రి కేటీఆర్ దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా నియోజకవర్గ సమస్యలపై సమీక్షించడానికి మరో నలుగురు రాష్ట్ర మంత్రులు జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లతో కలిసి నేడు (గురువారం) మంత్రి కేటీఆర్ మునుగోడుకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ సమావేశానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణా రెడ్డి సమీక్షా సమావేశ ఏర్పాట్లను పరిశీలించారు.

స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులపై ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మునుగోడు పట్టణంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో సమీక్ష సమావేశం జరగనుంది. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణాల సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లను సమీక్షా సమావేశానికి పిలిచారు. ఈ సమావేశంలో చర్చించేందుకు మునుగోడు నియోజకవర్గ సమస్యలపై ఉన్నతాధికారులు నివేదికను రూపొందించినట్టుగా తెలుస్తోంది. రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మున్సిపాలిటీల్లో సమస్యలపై.. సమావేశం జరగొచ్చని అంచనా.

మునుగోడు ఉప ఎన్నికలకు ముందు జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని, మునుగోడు అభివృద్ధిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. మునుగోడుకు ఇటీవ‌ల జ‌రిగిన ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి గెలుపొందిన విష‌యం విదిత‌మే.