సంతోష్‌కు రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందే.. సోషల్ మీడియాలో ప్రచారం - MicTv.in - Telugu News
mictv telugu

సంతోష్‌కు రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందే.. సోషల్ మీడియాలో ప్రచారం

March 3, 2018

తెలంగాణలో ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లు భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కు అవకాశం లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఒకసీటుకు ఆయన పేరు దాదాపు ఖరారైందని కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన అభిమానులు ఈ విషయంలో గట్టి పట్టుదలలో ఉన్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీని మొదటి నుంచీ అంటిపెట్టుకుని ఉన్న సంతోష్‌ రాజ్యసభ ఎంపీ పదవికి అన్ని రకాలుగా అర్హుడని, అధిష్టానం దీనిపై స్పష్టమైన హామీని ఇవ్వాలని కోరుతున్నారు.  

సంతోష్ పార్టీ కష్టకాలంలోనూ ఉన్నా మరో ఆలోచన లేకుండా కేసీఆర్‌తోనే ఉన్నారని, 17 ఏళ్లుగా పార్టీకి ఎన్నో సేవలు చేశారని చెబుతున్నారు. సంతోష్ ఇప్పటికీ రోజులకు 18 గంటలు కష్టపడుతున్నారని, కేసీఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అవసరంగా తలదూర్చారని, రాజ్యసభ సీట్ల భర్తీ టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని, రేవంత్‌కు ప్రశ్నించే అర్హత లేదని అంటున్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారందరికీ కేసీఆర్ తగిన పదవులు ఇస్తున్నారని, సంతోష్‌కు ఆయన అన్యాయం చేయరని చెబుతున్నారు.  

యాదవ అభ్యర్థి ఎవరు?

సంతోష్ విషయాన్ని పక్కనబెడితే, మిగతా రెండు సీట్లుకు ఎవరిని అభ్యర్థులుగా ప్రకటిస్తారన్నదానిపై చర్చ జరుగుతోంది. ఈసారి యాదవ వర్గానికి చెందిన ఒకరిని రాజ్యసభకు పంపిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ యాదవుడు ఎవరన్న ఆసక్తి పెరుగుతోంది. ఈ సీటు కోసం పలువురు యాదవ ప్రముఖులు సెక్రటేరియట్, ప్రగతి భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.