తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు అడ్డాగా మారిందని కేటీఆర్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ ఆప్లయెన్సెస్ సంస్థ ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్‌ను సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డిలతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..”రాబోయే పదేళ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దేశవ్యాప్తంగా పరిశ్రమలకు తెలంగాణ అడ్డాగా మారింది. ప్రముఖ సంస్థలన్నీ తెలంగాణలో వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎదురుచూస్తున్నాయి.
కేసీఆర్ రాష్ట వ్యాప్తంగా శాంతిభద్రతలు, మౌలిక వసతులు, ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందిస్తున్న కారణంగానే, చాలా కంపెనీలు ఇక్కడ నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఎల్ఈడీ టీవీలను రేడియంట్ సంస్థ తయారు చేస్తుంది. ఇక్కడ నుంచే 50 లక్షల టీవీలు తయారు కావడం చాలా గర్వంగా ఉంది. సంస్థలో పనిచేసే 3,800 మందిలో 50 శాతం మహిళలు, స్థానికులు ఉండటం సంతోషాన్నిస్తోంది. ఫ్యాబ్ సిటీలో ప్రత్యక్షంగా 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. త్వరలోనే రాష్ట్రంలో మరో రెండు ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తాం” అని కేటీఆర్ అన్నారు.
మరోపక్క ఇటీవలే విప్రో సంస్థ తన కంపెనీకి చెందిన సబ్బుల తయారీ యూనిట్‌ను రూ.300 కోట్లతో హైదరాబాద్ శివారులోని మహేశ్వరంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ యూనిట్‌ను విప్రో ఫౌండర్ చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తాజాగా అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్ 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద క్యాంపస్‌ను నిర్మించనున్న సందర్భంగా క్యాంపస్ నిర్మాణానికి కేటీఆర్ భూమిపూజ చేసిన విషయం తెలిసిందే.