బీజెపీ పై వార్ డిక్లేర్ చేసిన కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

బీజెపీ పై వార్ డిక్లేర్ చేసిన కేసీఆర్

August 8, 2017

బిజెపీ – టీఆర్ఎస్ సంబంధాలపై రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. బిజెపీతో కేసీఆర్ అమీతుమీకి సిద్ధమయ్యారా ? ఇది GST పెట్టిన చిచ్చా ? లేకపోతే రాజకీయ సమీకరణలు మారుతున్న క్రమమా ? అనేది తెలియాల్సి వుంది. మొదట GST ముసాయిదాను, తర్వాత బిల్లును కేసీఆర్ దేశంలోనే అందరికంటే ముందే ఆహ్వానించారు. ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రజల అవసరాలను తీర్చడంలో GST ప్రక్రియ విఫలమైందని రాష్ర్టానికి రావాల్సిన అనేక అంశాలు GST మూలంగా నష్టపోతున్నామని టీఆర్ఎస్ తన వాయిస్ ను పెంచింది. ఈ క్రమంలో బిజెపీకి వ్యతిరేకంగా GST విషయంలో బహిరంగ ప్రకటనలకు సిద్ధపడింది గులాబీ దండు.

ప్రజల అవసరాల మేరకే మా రాజకీయాలుంటాయని, అది బిజేపీతో దోస్తీ కావచ్చు ఇంకే రాజకీయ పక్షంతో మేకు కుదుర్చుకునే డీల్ కావచ్చు. అనేది టీఆర్ఎస్ పార్టీ తమ వైఖరిగా చెప్పుకుంటోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్థిక శాఖా మంత్రి ఈటల రాజేందర్ కేంద్రంతో GST కి వ్యతిరేకంగా అన్నీ రకాల నిరసనలను తెలపటానికి అలాగే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమంటున్నారు. ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులు GST మూలంగా ఆలస్యమయ్యే ఛాన్సులున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రం దగ్గర కేంద్రం వివిధ ప్రాజెక్టుల దగ్గర వసూలు చెయ్యాలని నిర్ణయించిన 12 శాతాన్ని 5 శాతానికి పరిమితం చెయ్యాలనేది టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

ఇవిలా వుంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే వివిధ కార్యక్రమాలకు 18 శాతం GST ని వసూలు చెయ్యాలని కేంద్రం ముందుగా నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ 18 శాతం GST ని వ్యతిరేకించడంతో GST కౌన్సిల్ 12 శాతానికి కుదించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం 5 శాతం డిమాండ్ చేయడం, దీన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా అనేది వేచి చూడాలి. అయితే ఇప్పటి కేంద్ర మంత్రి బంఢారు దత్తాత్రేయ కేసీఆర్ తో రాయబారానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

మరో వైపు ఇంకో ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది ఎంపీలను బిజెపీ తనలో కలుపుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఈ విషయం తెల్సిన కేసిఆర్ ముందుగానే బిజెపీ పై తిరుగుబాటు జెండా ఎత్తినట్టుగా అర్థమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.