TRS working group meeting chaired by CM KCR today
mictv telugu

 నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం

November 15, 2022

గులాబీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన.. నేడు టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు  తెలంగాణ భవన్‌లో పార్టీ శాసనసభ, పార్లమెంటరీ పక్షాలు, రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యే ఈ భేటీకి..  సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, మరోసారి అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా.. పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసే ప్రధాన ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో కలిసి సమన్వయంగా పని చేసేలా నియోజవకవర్గానికి ఓ ఇంఛార్జీని నియమించనున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఎన్నికల్లో చోటుచేసుకున్న పలు పరిణామాలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది.

మునుగోడు ఉపఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలకు ప్రలోభాలు వెలుగు చూసినందున.. ప్రజాప్రతినిధులకు గులాబీ దళపతి కీలక సూచనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సిట్టింగ్​లకు మళ్లీ అవకాశమిస్తామని.. గతంలోనే పలు సందర్భాల్లో చెప్పిన కేసీఆర్ మరోసారి వారికి భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. తమ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు.. బీజేపీ, కాంగ్రెస్ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా వ్యూహాలను సిద్ధం చేయనున్నారు.