జాతీయ పార్టీలు కాదు, జాతికి ద్రోహం చేసిన పార్టీలు.. కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

జాతీయ పార్టీలు కాదు, జాతికి ద్రోహం చేసిన పార్టీలు.. కేటీఆర్

March 29, 2019

71 ఏళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైందని, ప్రస్తుతం సమాఖ్య స్ఫూర్తితో కూడిన బలమైన ప్రత్యామ్నాయం అవసరమని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. తాము ఆచరణ సాధ్యమయ్యే హామీలను ఇచ్చి నెరవేర్చడం వల్ల తెలంగాణ  ప్రజలు తమకు రెండోసారి పట్టం కట్టారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తమకు 16 సీట్లు వస్తే జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని, కేవలం ఓట్ల కోసమే చంద్రబాబు తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. జగన్‌కు తాము డబ్బులిచ్చి గెలిపించాల్సిన అవసరం లేదని, ఆంధ్రా ప్రజలు ఎవరికి ఓటేయాలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు.

మైక్ టీవీ ప్రతినిధి సతీశ్‌ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు జాతీయ, ప్రాంతీయ అంశాలపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించారు. ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇదీ..

ప్రశ్న: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ప్రచారం ఎలా సాగుతోంది?

జవాబు: ప్రచారం జోరుగా నడుస్తోంది. సారు, కారు, పదహారు, ఇదే జోరు, ఢిల్లీలో సర్కారు. ఇదే మా నినాదం. ప్రచారం బ్రహ్మాండంగా సాగుతోంది. శాసనసభ ఎన్నికల్లో ఎలాగైతే ప్రజల ఆశీర్వాదంతో  ఏకపక్షంగా గెలిచామో అలాంటి ఫలితాలే లోక్‌సభ ఎన్నికల్లోనూ వస్తాయని ఆశిస్తున్నాం.

ప్రశ్న: మీ అభ్యర్థుల్లో కొత్తవాళ్లు కనిపిస్తున్నారు? ఎందుకిలా?

జవాబు:  పార్లమెంటు నియోజకర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 లక్షల నుంచి 30 లక్షల మంది ఓటర్లకు పరిచయమున్న అభ్యర్థి అంత సులభంగా దొరకరు. అసెంబ్లీకి, లేకపోతే మండలానికి పరిమితమైన వాళ్లే ఎక్కువ ఉంటారు. ఈసారి మా అభ్యర్థుల్లో నలుగురు కొత్తవాళ్లు ఉన్నారు. వారు వారి రంగాల్లో రాణించారు. విజయాలు అందుకున్నారు. మహబూబ్ నగర్ అభ్యర్థి  మన్నె శ్రీనివాస్ రెడ్డి.. ఎమ్మెస్సెన్ ల్యాబ్ పెట్టి రెడ్డి ల్యాబ్స్ వంటి వాటికి దీటుగా ఔషధ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణ వ్యక్తి విజయం. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆయన మీడియాకు, రాజకీయ వర్గాలకు తెలియకపోవచ్చు. కానీ ఆ ప్రాంతవాసులకు సుపరిచితుడు.

ప్రశ్న: మరి  టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎంపీల పరిస్థితి?

జవాబు:  ఏ పార్టీ అయినా ఒకే కోణం, ఒకే విధానంతో టికెట్లు ఇవ్వదు. కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు కూడా సిట్టింగ్ ఎంపీలందరికీ  టికెట్లు ఇవ్వలేకపోయాయి. టీఆర్ఎస్‌కు కూడా అదే సూత్రం వర్తిస్తుంది. కొందరు సిట్టింగ్ ఎంపీలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయలేదనే విమర్శలు వచ్చాయి. అలాంటివారికంటే వివాద రహితులు మెరుగనే అభిప్రాయంతో కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాం.

ప్రశ్న: అసంతృప్తులను మీరే స్వయంగా బుజ్జగిస్తున్నారని వినిపిస్తోంది?

జవాబు:  టికెట్ రానప్పుడు ఎవరికైనా అసంతృప్తి, బాధ సహజం. టికెట్ అనే కాదు, ఏదైనా ఆశించినది దొరకనప్పుడు మనిషికి అసంతృప్తి ఉంటుంది.

ప్రశ్న: మీరు గతంలో మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు పార్టీ  కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. ఏది బాగుంది?

జవాబు:  రాజకీయాల్లో ఎదిగినకొద్దీ పరిణతి చెందుతాం. 2006లో నేను రాజకీయాల్లో అడుగు పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమ వేడి ఉండేది. కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. వరుస ఉపఎన్నికలు వచ్చాయి. నేను కష్టపడి పనిచేశాను. 2009 ఎన్నికల్లో పోటీ చేశాను. ఎదురు దెబ్బలు తిన్నాను. చావుతప్పి కన్నులొట్టపోయి 171 ఓట్ల తేడాతో గెలిచాను.. తర్వాత పది నెలల్లోపే వచ్చిన ఉప ఎన్నికల్లో 68 వేల ఓట్ల తేడాతో గెలిచాను. ఐదేళ్ల తర్వాత వచ్చిన ఎన్నికల్లో 54 వేల ఓట్ల తేడాతో గెలిచాను. మొన్నటి ఎన్నికల్లో  89 వేల ఓట్ల తేడాతో గెలుపొందాను. రాజకీయాల్లో ఇలాంటి ఎదురు దెబ్బలు, డక్కామొక్కీలు తినడం, కిందపడడం, పైకి లేవడం ఇవన్నీ సహజం. ఇవి మనిషికి పరిణతిని, గ్నానాన్ని, అవగాహనను పెంచుతాయి.

ప్రశ్న: ప్రభుత్వాన్ని నడపటానికి, పార్టీని నడపడానికి  మధ్య తేడా ఉంటుంది కదా?

జవాబు:  ఒక్క సంగతి. Life is all about aligning of expectations. అంటే జనం నీ నుంచి ఏం ఆశిస్తున్నారు? నువ్వు ఎంతవరకు చేయగలవు? అడ్డగోలు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకపోతే ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. అలా కాకుండా ఆచరణసాధ్యమైన, పరిమితమైన వాగ్దానాలు ఇచ్చి అధికారంలో వచ్చాక వాటిని నెరవేరిస్తే ప్రజల్లో సంతృప్తి ఉంటుంది. మేం చెప్పింది చేశాం. అందుకే రెండోసారి గెలిచాం. రెండోసారి మేమిచ్చిన వాగ్దానాలు కూడా ఆచరణ సాధ్యం కానివేవీ కాదు. ఉదాహరణకు.. లక్ష రూపాయల రుణమాఫీ. ఏకకాలంలో దాన్ని చేయలేమని చెప్పాం. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలను ఆకట్టుకోడానికి ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అందులోని డొల్లతనాన్ని గమనించే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు. Aligning of expectations అంటే ఇదే. అది సాధ్యపడినప్పుడు ఏ రంగంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా ఇబ్బంది ఉండదు.

ప్రశ్న: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని ప్రతికూల ఫలితాలు వచ్చాయి కదా, ఎలా అర్థం చేసుకోవాలి?

జవాబు:  వాటికి అంత ప్రాధాన్యం ఉంటుందనుకోను. మేం ఎవరికీ బీఫామ్ ఇవ్వలేదు. కొందరు అభ్యర్థులు కొంతమంది నేతల మద్దతు కూడగట్టుకున్నారు. వాళ్ల ఓటమిని మాకు అంటగట్టాలనుకుంటే మాకేం అభ్యంతరం లేదు! మేం ఎన్నికల్లో దిగితే ఇలా మామూలుగా దిగం. గతంలో స్వామిగౌడ్‌కు మా పార్టీ బీఫామ్ ఇచ్చింది. మా నాయకులు ప్రచారం చేశారు. కానీ ఈ ఎన్నికల్లో మేం అసలు లేం. పార్లమెంటు ఎన్నికలపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించాం.  ఒపీనియన్ మేకర్స్ మాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని అనుకోవడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలిచారంటే అది ఆయనకు అనుకూలంగా వచ్చిన తీర్పేగాని, టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఇచ్చింది కాదు. టీఆర్ఎస్ అభ్యర్థే లేనప్పుడు అది టీఆర్ఎస్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు కాదు. రాష్ట్రంలో 54 ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. వాటి రాజకీయాలు అర్థం కావు. అందుకే కొందరు యూటీఎఫ్‌ను, కొందరు పీఆర్టీని ఎంచుకున్నారు. కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్సీని గెలిస్తేనే మాకు చెంపపెట్టు అయితే మేం 88 మంది ఎమ్మెల్యేలను గెలుచున్నాం. మరి కాంగ్రెస్‌కు అదేం కావాలి?

ప్రశ్న: లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 సీట్లు గెలిస్తే దేశాన్ని ఎట్లా శాసించగలుతుంది?

జవాబు:  14 మంది ఎంపీలు ఉన్నప్పుడు మీరేం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతున్నారు. 2014లో నరేంద్ర మోదీ గారికి 283 సీట్లు వచ్చాయి. సొంతంగా ఆయన అధికారంలోకి వచ్చారు. ఆయనకు ఎవరి అవసరమూ లేకపోయింది. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ వేడి తగ్గింది, కాంగ్రెస్ గాడి తప్పింది. నరేంద్ర మోదీకి ఇప్పుడు 150 సీట్లు, కాంగ్రెస్‌కు 100 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ పరిస్థితిలో ఒక్కో సీటుకు విలువ ఎక్కువ. 16 సీట్లు ఉన్నవారు కూడా ఢిల్లీలో కీలకపాత్ర పోషించగలరు. ఈ 16 సీట్లు 16గారు ఉండదు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ అంటే ఇష్టం లేని బీఎస్పీ, ఎస్పీ, తృణమూల్, టీఆర్ఎస్, బీజేడీ, వైఎస్సార్సీపీ వంటి పార్టీలు చాలా ఉన్నాయి. వీటికి 150 నుంచి 170 సీట్లు వచ్చే అవకాశముంది. ఇలాంటి సందర్భంలో మనం తెలంగాణకే పరిమితమై, మన శక్తిని ఇతరులకు ధారపోయడం ఎందుకు? మనమే ఒక కూటమిగా ఉండి, సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తే రాష్ట్రాలతోపాటు  దేశం కూడా బాగుపడుతుంది.

ప్రశ్న: ప్రాంతీయ పార్టీలకు సమాఖ్య స్ఫూర్తి ఉండదని, అవి ప్రాంతీయ సంకుచితత్వంతో ఆలోచిస్తాయని జాతీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి?

జవాబు:  ఈ దేశంలో జాతీయ పార్టీలు ఎక్కడ ఉన్నాయి?  కాంగ్రెస్ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ. 20 రాష్ట్రాల్లో దాని ఉనికి లేదు. కేవలం 4 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. బీజేపీకి దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో తప్ప ఎక్కడా ఉనికి లేదు. సోదిలో కూడా లేదు. సాంకేతికంగా సీపీఐ, సీపీఎం కూడా జాతీయ పార్టీలే. కానీ వాటికంటే టీఆర్ఎస్‌కు ఎక్కువ సీట్లు ఉన్నాయి. కాబట్టి దేశంలో ఉన్నది చిన్నసైజు ప్రాంతీయ పార్టీలు, పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే. ప్రాంతీయ పార్టీలకు సమాఖ్య స్ఫూర్తి, జాతీయ భావనలు ఉండవనే కుట్రపూరిత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇది డొల్లవాదన. ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడిపై టీఆర్ఎస్ నేత కేసీఆర్ స్పందించిన తీరు ఏ ఇతర పార్టీలకన్నా ఉదాత్తంగా, ధీరోదాత్తంగా ఉంది. ఆ దాడిలో తెలంగాణ బిడ్డలెవరూ చనిపోకపోయినా 40 మంది అమరుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున సాయం చేశారు. భారత వాయసేన వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ పట్టుకున్న తర్వాత టీఆర్ఎస్ ఒక వారం పాటు తన కార్యక్రమాలను రద్దు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీలు ఆ పని చేయలేదు. మోదీగారు తెల్లవారగానే పోలింగ్ బూత్ వర్కర్లతో సమావేశం అయ్యారు. రాహుల్ గాంధీ మాటల దాడి చేశారు. ఈ జాతీయ పార్టీలకు ఉన్నంత అధికార దాహం మరొక పార్టీకి ఉండదు. వాటికంటే ప్రాంతీయ పార్టీలకే జాతీయ భావనలు ఎక్కువ, జాతి ప్రయోజనాలపై పట్టుదల ఎక్కువ. అసలు ఒక రాష్ట్ర ప్రయోజనం జాతి ప్రయోజనం కాదా? ఒక రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడినట్లు కాదా? రాష్ట్రాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందితే, దేశం అంత వేగంగా అభివృద్ధి చెందినట్లు కాదా? ప్రజలు ప్రాంతీయ పార్టీలు అందుబాటులో ఉంటే వాటినే గెలిపిస్తున్నారు. లేనిచోట్ల జాతీయ పార్టీలను గెలిపిస్తున్నారు.

ప్రశ్న: ప్రజలు కొన్ని పార్టీలకు స్పష్టమైన మెజారిటీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి ఇచ్చారు. టీఆర్ఎస్‌కు కూడా ఇచ్చారు?

జవాబు:  దేశవ్యాప్తంగా 1991 నుంచి.. అంటే పీవీ నరసింహారావుగారి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు చూస్తే కూటములే ఉన్నాయి తప్ప ఏ పార్టీకీ సొంత మెరిజారీటీ లేదు. 2014 ఎన్నికలు మాత్రమే మినహాయింపు. కానీ బీజేపీ కూడా కూటమిగానే పోటీ చేసింది. గత 28 ఏళ్లుగా సంకీర్ణ ప్రభుత్వాలే అధికారంలోకి ఉన్నాయి. కూటముల మధ్యే పోటీ ఉంది. బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి, నాన్ బీజేపీ- నాన్ కాంగ్రెస్ కూటముల మధ్యే పోటీ ఉంది. నాన్ బీజేపీ- నాన్ బీజేపీ కూటమి ఆచరణ సాధ్యం కానిదేమీ కాదు. ఏదో ఒకటి చేసిన ప్రధాని పీఠంపై కూర్చోవాలన్నది మా లక్ష్యం కాదు. 71 ఏళ్లు పాలించిన జాతీయ పార్టీలు అన్నేళ్లల్లో చేయలేని పనులను వచ్చే ఐదేళ్లలో ఎలా చేస్తాయి? ఇప్పటికీ చాలా ఊళ్లకు కరెంటు లేదు. రోడ్లు లేవు. తాగునీరు లేదు. ఆ పార్టీలు దీనికి సమాధానం చెప్పాలి.

దేశ అవసరాలకు 45 వేల టీఎంసీల నీళ్లు చాలు. దేశంలో 75 వేల టీఎంసీలు ఉన్నాయి. 45 వేల టీఎంసీలను న్యాయబద్ధంగా ఎందుకు పంచడంలేదు?  అవి జాతీయ పార్టీలు కావు. జాతికి ద్రోహం చేసిన పార్టీలు. 71 ఏళ్లుగా జాతిని వంచించిన పార్టీలు. వీటి నుంచి దేశం విముక్తం కావాలి. మన తర్వాత స్వతంత్రం పొందిన దేశాలు కూడా మనల్ని దాటుకుని ముందుకు పోయాయి. మనం వెనుకబడే ఉన్నాం. దీనికి కారణం ఆ రెండు పార్టీలే.

ప్రశ్న: మతం-రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఇటీవల నిజామాబాద్ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమది అసలైన హిందుత్వం, బీజేపీదీ రాజకీయ హిందుత్వం అన్న ఆయన వ్యాఖ్యలను మీ పార్టీ విధాన ప్రకటనగా భావించవచ్చా?

జవాబు:  అది నిజం. ఎన్నికల్లో చర్చలు జరగాల్సిన అంశాలపై చర్చించడం లేదు. విద్య, ఉపాధి అవకాశాలు, వైద్యం వంటి వాటిపై చర్చించడం లేదు. ఒకాయన మందిర్ అంటారు, మరొకాయన చౌకీదార్ చోర్ హై అంటాడు. ప్రధాన అంశాలపై, పెద్దనోట్ల రద్దుపై చర్చ సాగడం లేదు. సామాన్య ప్రజలు మందిరం, మసీదు కోరుకోవడం లేదు. తమ పిల్లలకు విద్య అందాలని, బాగుపడాలని కోరుతున్నారు. మందిర్, మసీదు రాజకీయాలో చేసేవారికి తిరుగులేని జవాబు ఇవ్వాలి. అందుకే ఫెడరల్ ఫ్రంట్ ఒక ప్రయత్నం.. అవసరమైతే జాతీయ పార్టీ కూడా పెడతాం అన్నారు కేసీఆర్. పేదవాడు హిందువైనా, ముస్లిం అయినా పేదవాడే. కేసీఆర్ ఎవర్నీ బుజ్జగించడం లేదు. రంజాన్‌కు బట్టలు పెడతున్నారు, దసరాకూ, క్రిస్మస్‌ కూ ఇస్తున్నారు. పండగపూట పేదవాడికి సాయం చేయాలని చూస్తే దాన్ని కూడా భూతద్దంతో చూస్తే ఎలా? హిందుత్వాన్ని ఓట్ల కోసం వాడుకుంటున్నారు. వాళ్లకు రామ మందిరం ఎన్నికలప్పుడే గుర్తొస్తుంది. యాదాద్రిని కేసీఆర్ ఎలాంటి ప్రచారం లేకుండానే నిర్మిస్తున్నారు.

ప్రశ్న: ప్రతిపక్షం లేని తెలంగాణ దిశగా మీరు ప్రయత్నిస్తున్నారా?

జవాబు:  అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 75 శాతం సీట్లు, 50 శాతం ఓట్లు వచ్చాయి. రాజకీయ పార్టీల్లోకి చేరికలు చాలా సహజం. ఆ ఎన్నికలకు ముందు మా పార్టీ నుంచి కూడా ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి పోయారు. ఇప్పుడు ఇంకో పదిమంది వచ్చారు. వాళ్లు వాళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేరుతున్నారు. ఎమ్మెల్యేలే కాదు, మాజీలు, మునిసిపల్ చైర్మెన్లు ఎందరో చేరుతున్నారు. ఎందుకు? కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు, ఆ పార్టీపై ప్రజల్లో విశ్వాసం లేదు కనుక.

మేం కొంటున్నామని అంటున్నారు. మరి మీరు కూడా కొన్నారా? కాంగ్రెస్‌లోని అందరూ మారడం లేదు కదా. వాళ్లు చేసింది తప్పు అని మేం అనడం లేదు. రాజకీయ పార్టీల్లో చేరికలు చాలా సహజం. ఒక అజెండాగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని మేం అనుకోవడం లేదు.  

ప్రశ్న: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్, బీజేపీల్లో దేనికి మీరు మద్దతిస్తారా?

జవాబు:  అవి మాకెందుకు మద్దతు ఇవ్వకూడదు?  నాన్ కాంగ్రెస్-నాన్ బీజేపీ కూటమి ఎందుకు రాకూడదు? 170 సీట్లు వస్తే మాకెందుకు మద్దతివ్వకూడదు? 2004లో కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు 140. అంటే 25 శాతం. ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. ఈ దేశానికి నాన్ కాంగ్రెస్- నాన్ బీజేపీ నేతలు ఎందుకు ప్రధాన మంత్రులు కాకూడదు? ఎన్నికల ఫలితాలు వచ్చాక అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. మోదీ, రాహుల్.. రఫేల్, బోఫోర్స్.. ఎప్పుడూ వీరి మధ్యనే చర్చ జరగాలా? దేశంలో ఇంకే నేతలూ లేరా? కాంగ్రెస్‌కు ఇప్పుడు 44 మంది ఎంపీలు ఉన్నాయి. అమేధీ మున్సిపాల్టీలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కలలు గనొచ్చుగాని 4 కోట్ల మంది ఆశీర్వాదంతో రెండోసారి సీఎం అయినా కేసీఆర్ ప్రధాని కావడానికి అర్హులు కారా? ప్రధాని పదవికి మోదీ, రాహుల్ కంటే అర్హులు చాలామంది ఉన్నారు. వారికి బలముందా లేదా అన్నది ఎన్నికల తర్వాత తెలుస్తుంది. కేసీఆర్ ప్రధాని కావాలని చెబితే అతిశయోక్తి, అంహకారంగా కనిపిస్తుంది. కానీ నాన్ కాగ్రెస్ –నాన్ బీజేపీ నేత  ప్రధాని కావాలన్నది మా ఆకాంక్ష.

ప్రశ్న:  నిజామాబాద్ రైతులు ఆందోళనపై మీ స్పందనేంటి?

జవాబు:  ఐదేళ్లగా పోరాటం చేస్తున్నా కేంద్రం పసుపు బోర్డు పెట్టలేదు. మేం స్పైస్ బోర్డు పెట్టాం. అక్కడ జరుగుతోందంతా రాజకీయ ఆందోళ మాత్రమే . నామినేషన్  వేసిన వాళ్లు కాంగ్రెస్ రైతులు, బీజేపీ రైతులు.. అంతేతప్ప అసలైన రైతులు కాదు. ఏదో ఒకటి చేసిన ఎన్నికలు వాయిదా వేయాలన్నది వాళ్ల ఆలోచన. కనీస మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వ  చేతుల్లో లేదు. దీన్ని రాజకీయం చేస్తున్నారు. మేమేం ఆందోళన చెందడం లేదు. పోలింగ్ ఈవీఎంలతో జరిగినా ఎదుర్కొంటాం, బ్యాలట్ పేపర్లతో జరిగినా ఎదుర్కొంటాం. ఏప్రిల్ 11న జరిగినా ఎదుర్కొంటాం, రెండు రోజుల తర్వాత జరినా ఎదుర్కొంటాం.

ప్రశ్న:  ఏపీ ఎన్నికల కోసం జగన్ మోహన్ రెడ్డికి మీరు వెయ్యి కోట్లు పంపించారని ఆరోపణలు వస్తున్నాయి?

జవాబు:  ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత ఈ పని చేశాను అని చెప్పుకోడానికి ఏదైనా ఉండాలి. ఇంకో ఐదేళ్లు అవకాశం ఇస్తే ఫలానా పని చేస్తామని చెప్పుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడిగారికి చెప్పుకోడానికి చేసిందేమీ లేదు. ప్రచార పటాటోపం తప్ప మరేమీ లేదు. అందుకే కేసీఆర్‌పై నిందలు వేస్తున్నారు. మాకూ, జగన్ మోహన్ రెడ్డికి ఏం సంబంధం? చంద్రబాబు.. రాహుల్ గాంధీతో పొత్తుపెట్టుకున్నారు. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ శక్తులను కూడగట్టడంలో భాగంగా జగన్‌తో జాతీయ స్థాయిలో కలసి పనిచేద్దామనుకుంటున్నాం. అతే తప్ప జగన్ గారికి అర్జంటుగా ఆంధ్రాకు వెళ్లి ప్రచారం చేయాలని మేమనుకోవడం లేదు. డబ్బులిచ్చి గెలిపించాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆ అవసరం ఉందని నేననుకోను. మేం ఆంధ్రాలో పోటీ చేయడంలేదు. రాజకీయాల్లో ఉన్నాం కనుక ఆసక్తిగా గమనిస్తున్నాం. ఆంధ్రా ప్రజలు చైతన్యవంతులు, వాళ్లు ఇప్పటికే ఒక నిర్ణయ తీసుకున్నారు. వాళ్లకు అర్థమైంది. 9 ఏళ్లలో హైదరాబాద్ లాంటి గొప్ప నగరాన్ని నిర్మించానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఐదేళ్లలో అమరావతిని ఎందుకు నిర్మించలేకపోయారు? బాహుబలి గ్రాఫిక్స్‌తో ఎన్ని రోజులు నెట్టుకొస్తారు? చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకోడానికి చిత్రవిచిత్ర ఆరోపణలు చేస్తున్నారు. మచిలీపట్నం పోర్టును మేం తీసుకెళ్తామని, పోలవరాన్ని ఆపేస్తామని అంటున్నారు. పోలవరం పూర్తయిందని వాళ్లే అన్నారు. పోలవరమే పూర్తయితే ఆ మునిగిపోయిన గ్రామాలను మేం ఏం చేసుకుంటాం? కేసీఆర్‌ను ఆంధ్రా ప్రజలు ద్వేషించడంలేదు. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలు ఓట్లు వేయకపోయుంటే మేం అంత మెజారిటీతో గెలిచేవాళ్లం కాదు. కేసీఆర్ అమరావతికి పోయినప్పుడు చంద్రబాబు, మోదీలు వచ్చినప్పటికంటే ఎక్కువ జనం వచ్చారు. కేసీఆర్‌ను తిడితే నాలుగు ఓట్లు పడతాయని బాబు ఆశ. అదది స్పష్టంగా ఓటమికి సంకేతం.

ప్రశ్న:  పవన్ కల్యాణ్ హైదరాబాద్‌ను పాకిస్తాన్‌తో పోల్చడం, ఆంధ్రులపై దాడిచేస్తున్నారని ఆరోపించడంపై?

జవాబు:  పవన్ కల్యాణ్, చంద్రబాబు తదితరుల ఆస్తులు, వ్యాపారాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. వారికే ఇబ్బంది లేనప్పుడు సామాన్య ఆంధ్రులకు ఇబ్బందులుంటాయా? 370 కోట్లు ఉన్న లోకేశ్ బాబు, 360 కోట్లు ఉన్న జగన్ మోహన్ రెడ్డిగారు, కోట్లు ఉన్న పవన్ కల్యణ్ గారికి లేని ఇబ్బందులు సామాన్యులకు ఉంటాయా?

ప్రశ్న:  ఎన్నికలు ఇంత ఖరీదైన వ్యహారంగా మారడానికి కారణం ఎవరు?

జవాబు:  చాలా కారణాలు ఉన్నాయి. అన్ని పార్టీలతోపాటు ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇది దేశానికి మంచిదా కాదా అని ఆలోచించాలి.