తనను తిట్టిన అధికారిపై కేటీఆర్ మానవత్వం
తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి, సస్పెన్షన్‌కు గురైన నల్గొండ జిల్లా చండూరు ఎంపీడీఓ సిహెచ్ నరేందర్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మానవత్వం చూపారు. కేటీఆర్‌పై ఎంపీడీవో సీహెచ్ నరేందర్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంగడిపేటకు చెందిన ఓ వ్యక్తి గ్రామంలో రోడ్లు బాగు చేయాలని ఎంపీడీవో నరేందర్‌కు ఫోన్ చేయగా.. సహనం కోల్పోయిన నరేందర్ నిధుల గురించి ప్రస్తావిస్తూ ఫోన్ చేసిన వ్యక్తితో పాటు అప్పటి మంత్రి కేటీఆర్‌పై రాయలేని విధంగా బూతులు తిట్టాడు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనిని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు నల్గొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఫిర్యాదు చేశారు. కలెక్టర్ విచారణకు ఆదేశించి, నరేందర్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. కొందరు ఇతర ఎంపీడీఓలు అసలు విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి, విషయాన్ని వివరించారు. నరేందర్ తొందర పాటులో అలా మాట్లాడి ఉండవచ్చనని కేటీఆర్‌కు తెలిపారు. దీంతో ఉన్నతాధికారులతో తాను మాట్లాడి సస్పెన్షన్ ఎత్తివేయించేందుకు ప్రయత్నిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.